Telugu Global
Andhra Pradesh

దేవినేని ఉమకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు.. మైలవరంలో పట్టు కోల్పోతున్న మాజీ మంత్రి

దేవినేని ఉమ వ్యవహార శైలి సొంత పార్టీలో విమర్శలకు దారి తీస్తోంది. ఆయన నాయకత్వాన్ని మైలవరంలో ఓ వర్గం ఒప్పుకోవడం లేదు.

దేవినేని ఉమకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు.. మైలవరంలో పట్టు కోల్పోతున్న మాజీ మంత్రి
X

ఏపీలోని మైలవరం నియోజకవర్గం రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారాయి. నిన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించకపోవడంపై కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇది వైసీపీలో అంతర్గత పోరుకు దారి తీసింది. కానీ వసంత కృష్ణ ప్రసాద్ ఆ ఎపిసోడ్‌ను ముగించేశారు. తాను జగన్ వెంటే నడుస్తానని, తన తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యవహారం టీడీపీలో అంతర్గత పోరుకు దారి తీస్తోంది.

మైలవరం నియోజకవర్గం నుంచి వరుసగా 2009, 2014లో గెలిచిన దేవినేని ఉమ.. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అంతా తానై వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్‌పై ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఆ తర్వాత కృష్ణప్రసాద్‌పై నిత్యం ఆరోపణలు చేస్తూ.. మైలవరంలో తనదే పై చేయిగా ఉండాలని ప్రయత్నించారు. కానీ కృష్ణ ప్రసాద్ కూడా దేవినేని ఉమకు కౌంటర్ ఇస్తూ వచ్చారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్దం నడిచింది. కానీ, ఇప్పుడు సొంత పార్టీ నుంచే దేవినేని ఉమకు వ్యతిరేకత మొదలైంది.

దేవినేని ఉమ వ్యవహార శైలి సొంత పార్టీలో విమర్శలకు దారి తీస్తోంది. ఆయన నాయకత్వాన్ని మైలవరంలో ఓ వర్గం ఒప్పుకోవడం లేదు. దేవినేని ఉమ వ్యతిరేకి బొమ్మసాని సుబ్బారావు ఆయనకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బొమ్మసానికే టికెట్ వస్తుందంటూ ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. నియోజకవర్గం అంతా బొమ్మసాని ఫ్లెక్సీలు పెట్టి హంగామా చేస్తున్నారు. బొమ్మసాని కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. దేవినేనికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వరుసగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. దేవినేనిని పూర్తిగా సైడ్ చేశారు. ప్రస్తుతం మైలవరం నియోజకవర్గంలో బొమ్మసాని వర్గానికి, దేవినేని వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మైలవరం టికెట్‌ను బొమ్మసానికి కేటాయించకపోతే దేవినేని ఉమను ఓడించి తీరతామని టీడీపీలో ఓ వర్గం వ్యాఖ్యానిస్తోంది. స్థానికుడైన బొమ్మసానికి టికెట్ ఇవ్వకుండా స్థానికేతరుడైన ఉమకు ఎలా ఇస్తారంటూ వాదిస్తోంది. లోకల్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బొమ్మసాని వర్గీయులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఉమకు స్థానికంగా ఇబ్బందులు కలిగిస్తోంది. నియోజకవర్గంలో ఉమకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ వర్గీయులందరినీ బొమ్మసాని కలుపుకొని పోతున్నారు. ఉమ తీరు వల్ల నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను కలుస్తూ.. వారిని తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

బొమ్మసాని మాత్రమే కాకుండా మైలవరం నియోజకవర్గంలో టీడీపీలో అనేక మంది దేవినేని ఉమను వ్యతిరేకిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో అంతా తానై వ్యవహరించిన దేవినేని ఏనాడూ సామాన్య కార్యకర్తలను పట్టిచుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికేతరుడు అయినా సరే గెలుపు కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేశారు. కానీ ఆయన మాత్రం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను పట్టించుకోలేదని అంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో దేవినేని ఉమకు టికెట్ ఇవ్వొద్దని స్థానిక టీడీపీ నేతల నుంచి డిమాండ్ వచ్చింది. అయినా సరే చంద్రబాబు ఆ మాటలను పట్టించుకోకుండా ఉమకే టికెట్ కేటాయించారు.

ఒకవైపు వైసీపీ హవా, మరోవైపు దేవినేనిపై ఉన్న వ్యతిరేకత కారణంగా వసంత కృష్ణ ప్రసాద్ విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో దేవినేనికి కనుక టికెట్ ఇస్తే.. ఓడించి తీరుతామని స్థానిక టీడీపీ నాయకులు అంటున్నారు. అయినా సరే ఉమకే టికెట్ ఇస్తే వైసీపీ మరోసారి గెలుస్తుందని గంటా పథంగా చెబుతున్నారు. దేవినేని మాత్రం మైలవరం నుంచే తాను బరిలోకి దిగుతానని అంటున్నారు. టీడీపీలో కేవలం బొమ్మసాని వర్గం మాత్రమే తనపై అనవసరపు ఆరోపణలు చేస్తోందని, ఈ సారి గెలుపు ఖాయమని అంటున్నారు. మైలవరం రాజకీయాలపై చంద్రబాబు ఇంకా స్పందించలేదు. త్వరలో బొమ్మసాని, దేవినేనిని పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  2 Dec 2022 3:52 AM GMT
Next Story