Telugu Global
Andhra Pradesh

దేవినేని ఫుల్లు హ్యాపీయేనా? టైట్ ఫైటేనా?

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయబోతున్న అవినాష్‌ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని విజయవాడ తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ నేతలు, కార్యకర్తల‌కు జగన్ విజ్ఞప్తి చేశారు. దాంతో అవినాష్ ఫుల్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.

దేవినేని ఫుల్లు హ్యాపీయేనా? టైట్ ఫైటేనా?
X

ఎప్పటి నుండో చేస్తున్న దేవినేని అవినాష్ ప్రయత్నం బుధవారం సక్సెస్ అయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ నేతలు, కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవినేనిని అభ్యర్థిగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయబోతున్న అవినాష్‌ను అత్యధిక మెజారిటితో గెలిపించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. దాంతో అవినాష్ ఫుల్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.

పోయిన ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడలో పోటీ చేసిన దేవినేని ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి రాగానే అవినాష్ టీడీపీకి రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. అప్పట్లోనే విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ హామీ తీసుకునే పార్టీలో చేరారు. పార్టీలో చేరిన దగ్గర నుండి అవినాష్ బాగా కష్టపడుతున్నారు. రెగ్యులర్‌గా నియోజకవర్గంలో తిరుగుతూ జనాలతో పాటు నేతలు, క్యాడర్‌తో బాగా టచ్‌లో ఉంటున్నారు. ప్రభుత్వం తరపున అమలవుతున్న కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళుతున్నారు.

గడపగడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో కూడా బిజీగా తిరుగుతున్నారు. జనాల్లో చొచ్చుకుపోతున్న అవినాషే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి అనే ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచారమే ఇప్పుడు అధికారికమైంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే అవినాష్ ఎంత జనాల్లో తిరుగుతున్నా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గట్టి ప్రత్యర్థి. 2014, 19 ఎన్నికల్లో గద్దె ఇక్కడి నుండి గెలిచారు. గద్దెకు పార్టీతో పాటు కమ్మ సామాజికవర్గంలో మంచిపట్టుంది. అలాగే జనాల్లోనే రెగ్యులర్‌గా ఉంటారు.

సామాజికవర్గపరంగా చూస్తే ఇద్దరిదీ ఒకటే. ఇద్దరికీ జనాలో మంచిపట్టుంది. నియోజకవర్గంలో పార్టీ పరంగా ఇద్దరికీ సమస్యలు ఏమీలేవు. ఇద్దరికీ ప్లస్సులే కానీ మైనస్సులు పెద్దగా లేవు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ ఇద్దరి మధ్య మంచి రంజుగా ఉంటుంది. అధికారంలో ఉండటం అవినాష్‌కు అడ్వాంటేజ్‌గా ఉండచ్చు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గద్దె ఇక్కడి నుండే పోటీ చేస్తారా అనే విషయంలో కాస్త అనుమానాలున్నాయి. గద్దెను గన్నవరంకు మార్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  5 Jan 2023 6:21 AM GMT
Next Story