Telugu Global
Andhra Pradesh

బాబు ఆలోచనలను జగన్‌ కాపీ కొడుతున్నారంటున్న డిప్యూటీ సీఎం

చంద్రబాబునాయుడు తన మేనిఫెస్టోలో పెట్టబోయే అంశాలను ముందే తెలుసుకుని తాను జగన్‌మోహన్ రెడ్డికి చెప్పానని.. దాంతో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టబోయే పథకాలను ఇప్పుడే అమలయ్యేలా చూడగలిగామని చెప్పారు.

బాబు ఆలోచనలను జగన్‌ కాపీ కొడుతున్నారంటున్న డిప్యూటీ సీఎం
X

తానో యధార్థవాదిని అనిపించుకోవాలన్న ఉద్దేశమో ఏమో గానీ.. సొంత పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాలను కూడా డిప్యూటీ సీఎం నారాయణస్వామి బయటకు మాట్లాడేస్తుంటారు. ఇప్పటికే అనేకసార్లు ఆయన వ్యాఖ్యలు సొంత పార్టీని ఇరుకునపెట్టాయి. ప్రతిపక్ష మీడియాకు ఆయన వ్యాఖ్యలు ప్రముఖ వార్తలుగా మారిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా తమ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి.. చంద్రబాబు నిర్ణయాలను కాపీ కొడుతున్నారన్న అర్థం వచ్చేలా నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబునాయుడు తన మేనిఫెస్టోలో పెట్టబోయే అంశాలను ముందే తెలుసుకుని తాను జగన్‌మోహన్ రెడ్డికి చెప్పానని.. దాంతో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టబోయే పథకాలను ఇప్పుడే అమలయ్యేలా చూడగలిగామని చెప్పారు.

తనకు మరో అవకాశం ఇవ్వాల్సిందిగా చంద్రబాబు రాష్ట్ర మొత్తం తిరుగుతున్నారని.. రాబోయే మేనిఫెస్టోలో పేదలకు భూపంపిణీ అంశాన్ని కూడా చేర్చబోతున్నారని.. ఆ విషయం తెలిసి కేబినెట్‌ భేటీలో తాను జగన్‌కు చెప్పానన్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న పేదలను గుర్తించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని నారాయణస్వామి వివరించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో శ్మశానవాటికను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వబోతున్నారని.. ఆ విషయాన్ని కూడా సీఎంకు చెప్పగా.. భూసేకరణ చేసి మరీ శ్మశానవాటికలు ఏర్పాటు చేస్తామని జగన్‌మోహన్ రెడ్డి చెప్పారని నారాయణస్వామి వివరించారు.

ఈ అంశాలను ఎప్పటిలాగే టీడీపీ మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తూ.. చంద్రబాబు ఆలోచనలను జగన్‌మోహన్ రెడ్డి కాపీ కొడుతున్నారంటూ ప్రచారం చేస్తోంది.

First Published:  26 Nov 2022 2:57 AM GMT
Next Story