Telugu Global
Andhra Pradesh

మాధవ్ పై వేటు తప్పదా..? సంకేతాలు వచ్చినట్టేనా..?

నారాయణ స్వామి కూడా మహిళలకు తమ పార్టీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వివరణ ఇచ్చారు. వీడియో వ్యవహారంలో నిజానిజాలు వెలుగు చూస్తే వైసీపీ కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని స్పష్టమవుతోంది.

మాధవ్ పై వేటు తప్పదా..? సంకేతాలు వచ్చినట్టేనా..?
X

గతంలో వైసీపీ నేతల ఆడియో కాల్స్ లీకైన విషయంలో ఈ స్థాయిలో రచ్చ జరగలేదు. కానీ ఈసారి నేరుగా వీడియోలు లీక్ కావడం, వ్యవహారం ఢిల్లీ స్థాయిలో మారుమోగిపోవడంతో నష్టనివారణ చర్యలు తీసుకోడానికి వైసీపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ చర్యలు, మరోసారి ఇలాంటి తప్పు రిపీట్ కాకుండా కఠిన చర్యలు అంటూ వైసీపీ కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి సంకేతంగా భావించాల్సిందే. సజ్జల రామకృష్ణారెడ్డి బాటలోనే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా గోరంట్ల మాధవ్ వ్యవహారంపై కాస్త సీరియస్ గానే స్పందించారు. ఆ వీడియోపై విచారణ జరుగుతున్నట్టు వెల్లడించారాయన. వీడియో వాస్తవమేనని తేలితే ఇలాంటి ఘటనలు పున‌రావృతం కాకుండా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మహిళలు సంతోషంగా ఉండాలనే సీఎం జగన్ దిశా చట్టాన్ని తీసుకువచ్చారని, గోరంట్ల వీడియోలో నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని, వీడియో వాస్తవమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు నారాయణ స్వామి. సజ్జల కూడా దాదాపుగా ఇవే వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మహిళా పక్షపాతి అని, మహిళలను కించపరిచే ఎలాంటి చర్యలను తమ పార్టీ ప్రోత్సహించదన్నారు. ఇప్పుడు నారాయణ స్వామి కూడా మహిళలకు తమ పార్టీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వివరణ ఇచ్చారు. వీడియో వ్యవహారంలో నిజానిజాలు వెలుగు చూస్తే వైసీపీ కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని స్పష్టమవుతోంది.

గోరంట్లకు మద్దతు ఎవరు..?

ఇలాంటి వ్యవహారాలు బయటకొచ్చినప్పుడు ప్రతిపక్షాలపై తప్పుని నెట్టేయడం, ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించడం సహజ ప్రతిచర్యలు. అయితే ఈసారి గోరంట్ల మాధవ్ కు మద్దతుగా ఎవరూ బయటకు రాలేదు. గోరంట్ల సెల్ఫ్ డిక్లరేషన్ మినహా.. ఈ వీడియోని ప్రతిపక్షాల కుట్రగా ఎవరూ తిప్పికొట్టలేదు. అందరూ సైలెంట్ గా ఉన్నారు. సజ్జల, నారాయణ స్వామి వంటివారు క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ క్లారిటీ ఇచ్చారు కాబట్టి, ప్రతిపక్షాలు కూడా అంతకు మించి విమర్శలు చేసే అవకాశం లేకుండా పోయింది. గోరంట్లను వెనకేసుకుని వచ్చి పార్టీకి మరింత నష్టం చేకూర్చేందుకు నాయకులెవరూ సాహసం చేయడంలేదు. బురదను కడిగేసుకునే ప్రయత్నంలో భాగంగానే క్రమశిక్షణ చర్యలు అనే మాటలు బయటకొస్తున్నాయి.

First Published:  5 Aug 2022 5:48 AM GMT
Next Story