Telugu Global
Andhra Pradesh

వలంటీర్‌ను సస్పెండ్ చేయమన్న డిప్యూటీ సీఎం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

వెంటనే ఆ ఏరియా వలంటీర్‌పై తన కోపాన్ని డైవర్ట్ చేశారు. కనీసం పార్టీ గుర్తు ఏంటో కూడా వాళ్లకు చెప్పరా అంటూనే.. సదరు వలంటీర్‌ను సస్పెండ్ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. దీనిపై డిప్యుటీ సీఎంను పలువురు విమర్శిస్తున్నారు.

వలంటీర్‌ను సస్పెండ్ చేయమన్న డిప్యూటీ సీఎం.. వెల్లువెత్తుతున్న విమర్శలు
X

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థను దేశమంతా మెచ్చుకుంది. పాలనను ప్రజల వద్దకే నేరుగా తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్‌దే. ప్రతీ చిన్న పనికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. ప్రజలు అన్ని పనులు వలంటీర్లతోనే చేయించుకుంటున్నారు. కరోనా సమయంలో కూడా వలంటీర్లు సాహసోపేతంగా సేవలు అందించారు. కానీ కొంత మంది వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్లను తమ పనివాళ్లుగా ట్రీట్ చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.

వలంటీర్ల వ్యవస్థ ఏపీలో సమర్ధవంతంగా పని చేస్తున్నా.. వారికి అందేది గౌరవ వేతనమే. జీతం తక్కువ అయినా నిత్యం ప్రజల్లో ఉంటు సేవ చేస్తున్న వలంటీర్లపై అకారణంగా నిందలు మోపడం విమర్శలకు తావిస్తోంది. తాము చేయని తప్పుకు కూడా తమనే బాధ్యులు చేస్తున్నారంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఓ వలంటీర్ పట్ల దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతీ ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అంతే కాకుండా లబ్ధిదారులను అడిగి.. సక్రమంగా వలంటీర్లు పనిచేస్తున్నారా లేదా అని కూడా ఆరా తీశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం సుబ్బమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబానికి జగన్ ప్రభుత్వం వల్ల చేకూరిన లబ్ధిని వివరించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉండటం వల్లే ఇంత నగదు బదిలీ అయ్యిందని, ఇన్ని పథకాలు కుటుంబానికి వర్తించాయని చెప్పుకొచ్చారు.

ఇంత మంచి చేస్తున్న వైఎస్ జగన్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా అని సుబ్బమ్మను అడిగారు. దానికి ఆమె సైకిల్ గుర్తు అని బదులిచ్చింది. దీంతో నారాయణ స్వామికి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. వైఎస్ జగన్ వల్ల లబ్దిపొంది.. పార్టీ గుర్తు కూడా సరిగా చెప్పలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే గుర్తు చెప్పినా ఎలా స్పందించేవారో తెలియదు. కానీ సైకిల్ గుర్తు అనే సరికి ఆయన కోపం నషాళానికి అంటింది.

వెంటనే ఆ ఏరియా వలంటీర్‌పై తన కోపాన్ని డైవర్ట్ చేశారు. కనీసం పార్టీ గుర్తు ఏంటో కూడా వాళ్లకు చెప్పరా అంటూనే.. సదరు వలంటీర్‌ను సస్పెండ్ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. దీనిపై డిప్యుటీ సీఎంను పలువురు విమర్శిస్తున్నారు. ఆ మహిళ పార్టీ గుర్తు తప్పు చెప్తే వలంటీర్‌ను సస్పెండ్ చేయించడం ఏంటని మండిపడుతున్నారు. నిత్యం అనేక పథకాలను అమలు చేస్తూ.. లబ్ధిదారులను ఎంపిక చేస్తూ.. ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తూ బిజీగా ఉండే వలంటీర్లు.. ఇప్పుడు పార్టీ గుర్తులు ఏంటో కూడా నేర్పించాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ధోరణిని వైసీపీ నాయకులు వీడితే మంచిదని హితవు పలుకున్నారు.

వలంటీర్‌ను సస్పెండ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. డిప్యూటీ సీఎం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వలంటీర్లు కోరుతున్నారు. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

First Published:  30 July 2022 12:32 PM GMT
Next Story