Telugu Global
Andhra Pradesh

రామోజీ రాతలపై డిప్యూటీ సీఎం ఫైర్‌

గుడులు కూలగొట్టిన దుర్మార్గుడు చంద్రబాబు గురించి ఈనాడులో రాశారా అంటూ మంత్రి ప్రశ్నించారు. అసలు దేవదాయ శాఖలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా..? అని మండిపడ్డారు.

రామోజీ రాతలపై డిప్యూటీ సీఎం ఫైర్‌
X

రామోజీ రాతలపై ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఒక పవిత్ర శాఖకు అసత్యాలను ఆపాదిస్తూ ఒక కథనాన్ని ’ఈనాడు’లో వండివార్చారని ధ్వజమెత్తారు. దెందులూరులో శనివారం నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభకు జనతరంగం ఉవ్వెత్తున కదలి రావడం పచ్చరాతల రామోజీకి, అబద్ధాల చంద్రబాబుకు నచ్చినట్టు లేదని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో రామోజీ రాతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్షుద్ర రాతలు రామోజీ నైజం

అబద్ధాలకు కేరాఫ్‌ చంద్రబాబని, క్షుద్ర రాతలు రామోజీ నైజమని మంత్రి విమర్శించారు. కనకదుర్గమ్మ ఆలయంలో సిఫార్సు లేకుండా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకునే విధంగా టికెట్లు పెడితే వాస్తవాలు తెలీకుండా ఎల్లో మీడియా ఇష్టానుసారం రాస్తోందని మండిపడ్డారు. విజయవాడలో ఆలయాలను కూలగొట్టి విగ్రహాలను వాహనాల్లో వేసిన చంద్రబాబుకు అసలు దేవాలయాల గురించి ఏం తెలుసని మంత్రి ప్రశ్నించారు? ప్రభుత్వం మీద బురదజల్లడానికి ఆనాడు ఉద్దేశపూర్వకంగా రథం తగలబెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు ఏనాడైనా అర్చక స్వాములకు ఒక్క రూపాయి పెంచిన దాఖలాలున్నాయా అంటూ నిలదీశారు. అదే సీఎం జగన్‌ అర్చక స్వాములకు రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు.. రూ.10 వేలు తీసుకునే అర్చకులకు రూ.15 వేలకు పెంచారని తెలిపారు. రాష్ట్రంలో ఆరువేల ఆలయాలకు నిత్య ధూపదీప నైవేద్యాలకు నిధులు అందిస్తున్నామన్నారు. సీఎం జగన్‌ దేవుడి ఆస్తులను కాపాడటానికి దేవదాయ శాఖలో ప్రత్యేకంగా చట్టం చేశారని, ఈ విషయాన్ని ఎల్లోమీడియా ప్రచురించిందా అంటూ నిలదీశారు.

చంద్రబాబు దుర్మార్గాల గురించి ఏనాడైనా రాశారా?

గుడులు కూలగొట్టిన దుర్మార్గుడు చంద్రబాబు గురించి ఈనాడులో రాశారా అంటూ మంత్రి ప్రశ్నించారు. అసలు దేవదాయ శాఖలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా..? అని మండిపడ్డారు. దుర్గమ్మ ఆలయంలో గతంలో క్షుద్రపూజలు జరిగితే ’ఈనాడు’ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రజలను వంచించిన చంద్రబాబుకు పట్టం కట్టేందుకు ’ఈనాడు’ కృషిచేస్తోందని ధ్వజమెత్తారు. రామోజీ, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. దేవదాయ శాఖలో రూ.1,400 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. నిజానికి.. ప్రజలను ఓట్లువేసే యంత్రాలుగా చూసే వ్యక్తి చంద్రబాబేనని ఆయన తెలిపారు. ఇలాంటి నాయకులతో రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.

First Published:  5 Feb 2024 3:44 AM GMT
Next Story