Telugu Global
Andhra Pradesh

రాజీనామాలు చేయాల్సిందే, ఉప ఎన్నికలు రావాల్సిందే..

దమ్ముంటే ఆ నలుగురు రాజీనామా చేసి, తిరిగి గెలవాలంటూ సవాల్ విసిరారు మంత్రి రోజా. ఆ నలుగురు ఎమ్మేల్యేలు రాజీనామా చేసి వారికి నచ్చిన పార్టీ నుంచి పోటీ చేస్తే.. ఎవరి బలం ఏంటో తేలిపోతుందని అన్నారు.

రాజీనామాలు చేయాల్సిందే, ఉప ఎన్నికలు రావాల్సిందే..
X

ఏపీలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలపై రాజీనామా ఒత్తిడి పెరుగుతోంది. గతంలోనే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి దూరమైనా.. వారి విషయంలో ఎవరూ పెద్దగా గోల చేయలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా పార్టీ నుంచి సస్పెండ్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి విషయంలో మాత్రం రాజీనామాల డిమాండ్ పెరుగుతోంది. ఇద్దరి నియోజకవర్గాల్లో సొంతపార్టీలోనే ఉన్న వైరి వర్గాలు వారి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి, దిష్టిబొమ్మలు దహనం చేస్తూ, శవయాత్రలు చేపడుతూ హడావిడి చేస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు.

దమ్ముంటే రాజీనామా చేయాలి..

పార్టీనుంచి కూడా ఆ నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్లు వినిపిస్తున్నాయి. దమ్ముంటే ఆ నలుగురు రాజీనామా చేసి, తిరిగి గెలవాలంటూ సవాల్ విసిరారు మంత్రి రోజా. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మేల్యేలు రాజీనామా చేసి వారికి నచ్చిన పార్టీ నుంచి పోటీ చేస్తే.. ఎవరి బలం ఏంటో తేలిపోతుందని అన్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటుతో టీడీపీ అతిగా ఊహించుకుంటోందని మండిపడ్డారు.

శ్రీదేవి వ్యాఖ్యలు సరికాదు..

కోవిడ్ సమయంలో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర అస్వస్థతకు గురైతే.. స్పెషల్ ఫ్లైట్ పెట్టి సీఎం జగన్ ఆమె ప్రాణాలు కాపాడారని, ఈరోజు ఆయన నుండే ప్రాణహాని ఉందని శ్రీదేవి, చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. హైదరాబాద్ లో ఉండే డాక్టర్ ని తీసుకువచ్చి అమరావతిలో గెలిపిస్తే ఈరోజు పార్టీకి ద్రోహం చేసిందంటూ ఫైర్‌ అయ్యారు. ఎంత పెద్ద డాక్టర్‌ అయినా.. ఎంత సీనియర్‌ లీడర్‌ అయినా, గత ఎన్నికల్లో జగన్‌ బొమ్మచూసే జనం వారికి ఓట్లు వేశారన్నారు.

ఆ ముగ్గురు గెలిస్తే నేను రాజకీయం వదిలేస్తా..

మరోవైపు మాజీ మంత్రి అనిల్ కూడా నెల్లూరు జిల్లా బహిష్కృత ఎమ్మెల్యేలపై కామెంట్ చేశారు. ఆ ముగ్గురు 2024 ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే తాను రాజకీయ జీవితాన్ని వదిలేస్తానన్నారు. కొత్తగా పసుపు కండువా కప్పుకున్నవాళ్లు, తన గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారని, అలాంటివారు ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని సవాల్ విసిరారు.

First Published:  28 March 2023 12:05 AM GMT
Next Story