Telugu Global
Andhra Pradesh

ఏపీలో బీజేపీ ఖాళీ కాబోతుందా? పక్క చూపులు చూస్తున్న నేతలు!

జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేరు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ సీట్లలో బీజేపీ పోటీ చేస్తే.. తమకు తప్పకుండా టికెట్ వస్తుందని కొందరు అంచనా వేసుకున్నారు.

ఏపీలో బీజేపీ ఖాళీ కాబోతుందా? పక్క చూపులు చూస్తున్న నేతలు!
X

ఏపీ బీజేపీ నేతల్లో గుబులు మొదలైందా? జనసేనతో పొత్తు లేకుండా గెలవడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారా? పార్టీలో కొనసాగితే గెలుపు మాట దేవుడెరుగు.. కనీసం డిపాజిట్లు కూడా రావని డిసైడ్ అయ్యారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇన్నాళ్లు జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామనే ధీమాతో ఉన్న ఏపీ బీజేపీ నాయకులకు గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ బాస్ చంద్రబాబు నాయుడు కలవడంతో బీజేపీ నేతల్లో దిగులు మొదలైనట్లే కనిపిస్తోంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం పలు మార్లు వ్యాఖ్యానించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఈ విషయాన్ని అనేక సార్లు మీడియాకు వివరించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీతో పాటు కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని అన్నారు. అయితే, గతంలోనే బీజేపీ-టీడీపీకి చెడటంతో.. రాబోయే ఎన్నికల్లో కేవలం జనసేనతోనే పొత్తు ఉంటుందని బీజేపీ నాయకులు భావించారు. అలా అయితేనే బీజేపీకి కోరినన్ని సీట్లు వస్తాయని అనుకున్నారు.

జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేరు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ సీట్లలో బీజేపీ పోటీ చేస్తే.. తమకు తప్పకుండా టికెట్ వస్తుందని కొందరు అంచనా వేసుకున్నారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ నుంచి సరైన స్పందన లేదని పవన్ కల్యాణ్ కూడా వ్యాఖ్యానించారు. దీంతో భవిష్యత్‌లో పొత్తు పెట్టుకున్నా.. మూడు పార్టీలు కలసి పోటీ చేయాలి. చంద్రబాబు నాయుడు టీడీపీకి పోనూ జనసేన, బీజేపీ కలిపి పాతిక ముప్పై సీట్ల కంటే ఎక్కువ కేటాయించకపోవచ్చు. మరోవైపు ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి డిపాజిట్లు కూడా రావు. ఇవన్నీ అంచనా వేసుకున్న బీజేపీ నాయకులు కొందరు పార్టీ వీడాలనే అంచనాకు వచ్చరు.

ఇప్పటికే పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఏపీ బీజేపీలో చాలా మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులే ఉన్నారు. అందులో ఎక్కువగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఎక్కువ. ఇప్పుడు వాళ్లు పార్టీ మారాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరికలు లేకపోయినా.. టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తెలుగు దేశం నుంచి వచ్చిన అన్నం సతీశ్, ఆదినారాయణ రెడ్డి, వరదాపుర సూరి లాంటి వాళ్లు తిరిగి సొంత గూటికి చేరతారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆదినారాయణ సోదరుడి కుమారుడు టీడీపీలో చేరారు. మరి కొంత మంది నేతలు జనసేన వైపు కూడా చూస్తున్నట్లు తెలుస్తున్నది.

జనసేనకు సరైన అభ్యర్థులు లేనందున.. ఆ పార్టీలో చేరితే టికెట్ దక్కే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని.. టికెట్ హామీ లభిస్తే జంప్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఎన్నికల్లో జనసేన, టీడీపీతో కలసి బీజేపీ పోటీ చేస్తే మాత్రం వలసలు తగ్గవచ్చు. కానీ, టీడీపీ-జనసేన కలిసి బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తాయనే దానిపై అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీ బలం చూసుకుంటే నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ కేటాయించేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు. కానీ, బీజేపీ నాయకులు దాదాపు 30 సీట్లు కావాలని ఆశపడుతున్నారు. జనసేనతో కలిసి పోటీ చేసుంటే కోరినన్ని సీట్లు దక్కేవి. కానీ ఇప్పుడు మూడు పార్టీల పొత్తంతే తమను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తారనే ఆందోళన నెలకొన్నది.

ఇక బీజేపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడే ఉంటే ఎదుగుదల ఉండదని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ అయితే రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా బలపడే అవకాశం ఉంటుందని భావిస్తోంది. వైసీపీతో పాటు టీడీపీ వైపు బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు చూస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసే ఇలాంటి నాయకులను తీసుకోవడానికి టీడీపీ కూడా ఉత్సాహం చూపిస్తోంది. జనసేన కూడా ద్వితీయ శ్రేణి నాయకుల వల్ల పోల్ మేనేజ్‌మెంట్ సులభమవుతుందని ఆలోచిస్తోంది. మొత్తానికి గత నాలుగు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు బీజేపీకి భారీ నష్టాన్నే చేకూర్చనున్నది.

First Published:  20 Oct 2022 5:00 AM GMT
Next Story