Telugu Global
Andhra Pradesh

తల్లిదండ్రులపైనే చీటింగ్ కేసా ?

అయితే వీళ్ళెవరూ ఆ నోటీసులను పట్టించుకోలేదు. నాగిరెడ్డి చెల్లించాల్సిన అప్పు ఇప్పటికి రు. 19 కోట్లకు చేరింది. దాంతో బ్యాంకు అధికారులు ఫైనల్ నోటీసిచ్చి భూమి వేలం వేయటానికి రెడీ అయిపోయారు.

తల్లిదండ్రులపైనే చీటింగ్ కేసా ?
X

భూమా నాగిరెడ్డి దంపతుల వారసుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. వారసత్వంగా వచ్చిన ఆస్తులను దక్కించుకోవటం కోసం వారసులు ఎంతకైనా తెగిస్తారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. తమ ఆస్తుల కోసం చివరకు తల్లిదండ్రుల పరువు తీసేయటానికి సైతం వారసులు వెనకాడటంలేదు. ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్ళిందంటే చివరకు తల్లి, దండ్రులపైనే వారసులు చీటింగ్ కేసు పెట్టించేంతగా.

ఇంతకీ విషయం ఏమిటంటే ఏదో అవసరాల కోసం భూమా నాగిరెడ్డి కొంత‌ భూమిని 2011 డిసెంబర్లో నంద్యాలలోని ఆంధ్రాబ్యాంకులో తనఖాపెట్టి అప్పుతీసుకున్నారు. తాను బతికున్నంత వరకు రెగ్యులర్ గా ప్రతినెలా వాయిదాలు చెల్లించారు. అయితే ముందు ఆయన భార్య శోభా నాగిరెడ్డి చనిపోగా మరికొంత కాలానికి నాగిరెడ్డి కూడా చనిపోయారు. ఇద్దరిది కూడా అకాలమరణమే. దాంతో నాగిరెడ్డి కట్టాల్సిన అప్పు విషయంలో బ్యాంకు వారసులైన భూమా అఖిలప్రియ, భూమా మౌనిక, భూమా జగద్విఖ్యాతరెడ్డికి నోటీసులు పంపింది.

అయితే వీళ్ళెవరూ ఆ నోటీసులను పట్టించుకోలేదు. నాగిరెడ్డి చెల్లించాల్సిన అప్పు ఇప్పటికి రు. 19 కోట్లకు చేరింది. దాంతో బ్యాంకు అధికారులు ఫైనల్ నోటీసిచ్చి భూమి వేలం వేయటానికి రెడీ అయిపోయారు. దాంతో సడెన్ గా భూమా వారసులు రంగంలోకి దిగారు. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని 2011, డిసెంబర్ కన్నా నాలుగు నెలల ముందే తనకు అమ్మినట్లు వెంకటరమణయ్య అనే వ్యక్తి తెరమీదకు వచ్చారు. ఎవరికో అమ్మిన భూమిని తమకు తనఖా పెట్టుంటే ఆ విషయం బ్యాంకు అధికారులకు తెలిసిపోయేదే. అప్పట్లో సదరు భూమికి క్లీయర్ టైటిల్ ఉంది కాబట్టే బ్యాంకు అప్పు ఇచ్చింది.

అయితే అప్పట్లో తనఖా పెట్టిన భూమి విలువ ఇప్పుడు రు. 100 కోట్లు ఉంటుంది. దాంతో బ్యాంకుకు కట్టాల్సిన అప్పును ఎగ్గొట్టడమే కాకుండా అడ్డదారిలో ఆ భూమిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే భూమా వారసులు దొంగ పత్రాలను సృష్టించేంత స్ధాయికి దిగజారారంటు జిల్లాలో చెప్పుకుంటున్నారు. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే తనకు అమ్మేసిన భూమిని నాగిరెడ్డి మళ్ళీ బ్యాంకులో తనఖా పెట్టారని వెంకటరమణయ్య ఒక లాయర్ తో నాగిరెడ్డిపైన చీటింగ్ కేసు పెట్టించారు. ఇంతకీ ఆ లాయర్ ఎవరంటే అఖిలప్రియ పర్సనల్ లాయరేనట. అంటే వెంకటరమణయ్య, లాయర్, అఖిలప్రియ అంతా కలిసే ఈ వ్యవహారం నడుపుతున్నట్లు అర్థ‌మవుతోంది. ఈ వ్యవహారం ఎప్పటికి తెగుతుందో ఏమో తెలీదు కానీ చనిపోయిన తల్లిదండ్రుల మీద కూడా అఖిల చీటింగ్ కేసు పెట్టించేంత స్థాయికి దిగజారిపోయిందనే ఆరోపణలైతే పెరిగిపోతున్నాయి.

First Published:  9 Oct 2022 8:44 AM GMT
Next Story