Telugu Global
Andhra Pradesh

గన్‌మెన్లను చూపించి పంచాయితీలు చేస్తున్నాడా?

వివేకా మర్డర్ కేసు నిందితుల్లో కీలకమైన దస్తగిరి ఎవరి మీద పడితే వాళ్ళ మీదకు వెళ్ళటం, దౌర్జన్యం చేయటం, బెదిరించి తన దగ్గరకు పిలిపించుకుని పంచాయితీలు చేయటం ఎక్కువైపోయిందట. కారణం ఏమిటంటే తన చుట్టూ ఉన్న గన్‌మెన్లను చూపిస్తున్నాడట.

గన్‌మెన్లను చూపించి పంచాయితీలు చేస్తున్నాడా?
X

వివేకా మర్డర్ కేసు నిందితుల్లో కీలకమైన దస్తగిరి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. ఒకవైపు వివేకానందరెడ్డిని చంపానని చెప్పి అప్రూవర్‌గా మారిపోయాడు. వివేకాను తాను చంపాను కాబ్టటి తనకు ప్రాణభయం ఉందని భద్రత కోసం గన్‌మెన్లను తెచ్చుకున్నాడు. ఉన్న గన్‌మెన్లు తన భద్రతకు సరిపోరని కోర్టులో పిటీషన్ వేశాడు. సీబీఐ కూడా మద్దతుగా నిలవటంతో కోర్టు అదనపు భద్రత పెంచమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఐదు మంది గన్‌మెన్లు వచ్చారు.

ఎప్పుడైతే తన చుట్టూ గన్‌మెన్లు నిలబడ్డారో అప్పటి నుండి వాళ్ళని చూపించి పంచాయితీలు చేయటం మొదలుపెట్టాడట. ఎవరి మీద పడితే వాళ్ళ మీదకు వెళ్ళటం, దౌర్జన్యం చేయటం, బెదిరించి తన దగ్గరకు పిలిపించుకుని పంచాయితీలు చేయటం ఎక్కువైపోయిందట. కారణం ఏమిటంటే తన చుట్టూ ఉన్న గన్‌మెన్లను చూపిస్తున్నాడట. పైగా తన మాట ఎవరైనా వినకపోతే వివేకాను మర్డర్ చేసిన దస్తగిరిని అని గుర్తు చేసి మరీ బెదిరిస్తున్నాడట.

ఇపుడిదంతా ఎందుకంటే రైల్వేకోడూరు సెంటర్లో పోలీసుస్టేషన్ ఉంది. స్టేషన్‌కు దగ్గరలో ఉన్న మూడు షాపుల మీదకు దస్తగిరి సోమవారం మధ్యాహ్నం వెళ్ళి దౌర్జన్యంగా తాళాలు లాక్కున్నాడట. 30 ఏళ్ళ క్రితమే షాపులను అద్దెకిచ్చిన యజమాని సుబ్బరాయుడికి షాపులకు ఏమీ సంబంధం లేదని దస్తగిరి తేల్చేశాడట. షాపుల అసలు యజమాని ఖదార్ వలీ కాబట్టి వెంటనే షాపులను ఖాళీ చేసేయమని బెదిరించాడట. పది రోజుల్లోగా షాపులు ఖాళీ చేయకపోతే తర్వాత వచ్చి తానే ఆ పని చేయిస్తానని గన్‌మెన్లతో బెదిరించి వెళ్ళాడట.

దీనికి సంబంధించిన పంచాయితీ పక్కనే ఉన్న పోలీసుస్టేషన్లోనే జరగింది. స్టేషన్లో ఇన్‌స్పెక్టర్ మాట కూడా దస్తగిరి వినలేదట. ఎక్కడికి వెళ్ళినా గన్‌మెన్లు కూడా ఉంటారు కాబట్టి చాలా మంది దస్తగిరి అంటేనే భయపడిపోతున్నారు. వివేకానందరెడ్డినే మర్డర్ చేశాడంటే ఇక మనమెంత అనే భయంతో జనాలు కూడా పక్కకు తప్పుకుంటున్నారు. దస్తగిరికి కూడా సరిగ్గా ఇదే కావాలి. అందుకనే సీబీఐ మద్దతుతో కోర్టు ద్వారా గన్‌మెన్లను తెచ్చుకుని ఆడిందే ఆటగా జరిపించుకుంటున్నాడు.

First Published:  30 May 2023 5:19 AM GMT
Next Story