Telugu Global
Andhra Pradesh

వైసీపీలో మరో ఎమ్మెల్యేకి ఇంటిపోరు.. పొమ్మనకుండానే పొగ..

దర్శి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ప్రొటోకాల్ మర్యాదలు ఇవ్వడంలేదని, అవమాన పరుస్తున్నారని అన్నారాయన.

వైసీపీలో మరో ఎమ్మెల్యేకి ఇంటిపోరు.. పొమ్మనకుండానే పొగ..
X

ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించడం అన్ని పార్టీలకు ఆనవాయితీ. వైసీపీకి కూడా తనకున్న ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మద్దతు తెలిపిన వారు మినహా మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇన్ చార్జ్ లను పెట్టింది. ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలకు కూడా ఇన్ చార్జ్ లను ప్రకటిస్తూ ఉన్నవారికి షాకిస్తోంది. ఇటీవల తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఇలాగే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తో చెక్ పెట్టింది. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యేకి కూడా ఇలాగే షాకిచ్చారు సీఎం జగన్. మద్దిశెట్టి వేణుగోపాల్ వ్యతిరేక వర్గంగా ఉన్న బూచేపల్లి వర్గం ఇటీవల నియోజకవర్గంపై పట్టు పెంచుకునే పనిలో పడింది. దీంతో మద్దిశెట్టి బహిరంగంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. దర్శి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ప్రొటోకాల్ మర్యాదలు ఇవ్వడంలేదని, అవమాన పరుస్తున్నారని అన్నారాయన. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పార్టీ నేతలు కార్యకర్తలతో మీటింగ్ లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సహిస్తూనే వచ్చానంటున్న మద్దిశెట్టి, ఇక తగ్గేది లేదన్నారు. తాడో పేడో తేల్చుకుంటానంటున్నారు.

ఇటీవల సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చారు. వైఎస్ఆర్ విగ్రహం, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్క‌రించారు. వారి కాలేజీలో ఓ సభలో ప్రసంగించారు. అది మినహా జగన్ పర్యటనకు వేరే ప్రాధాన్యమేదీ లేదు. కానీ జగన్, విగ్రహాల ప్రారంభోత్సవానికి నేరుగా చీమకుర్తికి ఎందుకొచ్చారా అనుకున్నారంతా. పైగా ఆ కార్యక్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యే పాల్గొనలేదు. కనీసం బ్యానర్లలో ఆయన ఫొటో కూడా లేదు. దీంతో దర్శిలో ఏదో జరుగుతోందని అనుకున్నారు. పైగా ఆ కార్యక్రమంలో బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ వెంకాయమ్మకు జగన్ ఇచ్చిన ప్రయారిటీ కూడా హైలెట్ గా నిలిచింది. సుబ్బారెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిని కూడా జగన్ దగ్గరకు తీశారు. అప్పటికే స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కి ఈ సభతో మరింత క్లారిటీ వచ్చింది. కచ్చితంగా 2024లో తనకు వైసీపీ టికెట్ రాదని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పుడిలా బయటపడ్డారు.

ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్ర పోకుండా నియోజకవర్గ అభివృద్ధికోసం పనిచేస్తున్నానని అన్నారు వేణుగోపాల్. స్థానికంగా రెడ్డి సామాజిక వర్గంలో 90శాతం మంది తనవెంటే ఉన్నారని చెబుతున్నారాయన. తాను ఎవరి సీటూ లాక్కోలేదని, జగన్ పిలిచి పోటీ చేయమంటే చేశానని చెబుతున్నారు. ఇటీవల దర్శిలో పోటాపోటీ గా జగనన్న గృహాల నిర్మాణాలను మద్దిశెట్టి , బూచేపల్లి వర్గం ప్రారంభించింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కు సంబంధం లేకుండా నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, మండల నేతలతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దీంతో మద్దిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం కూడా ఆయనకు అనుకూలంగా లేదని తేలడంతో బహిరంగంగానే విమర్శలు సంధిస్తున్నారు.

First Published:  26 Aug 2022 12:51 PM GMT
Next Story