Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరి గజనీ అయిపోయారా?

భూమన మొదటిసారి టీటీడీకి ఛైర్మన్ అయినపుడు పురందేశ్వరి ఎంపీగా ఉన్నారు. అంటే అప్పట్లో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అప్పట్లో భూమన నియామకంపై పురందేశ్వరి ఏమీ మాట్లాడలేదు.

పురందేశ్వరి గజనీ అయిపోయారా?
X

బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గజనీలాగే తయారైనట్లున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా, విషయం ఉన్నా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదచల్ల‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ప్రభుత్వం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని నియమించింది. ఈ నియామకం విషయమై పురందేశ్వరి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఛైర్మన్‌గా భూమనను నియమించటంపై ఆమెకు అభ్యంతరం ఉందని అర్థ‌మవుతోంది.

అయితే తన అభ్యంతరాన్ని పురందేశ్వరి నేరుగా చెప్పలేదు. పరోక్షంగా, డొంకతిరుగుడుగా బయటపెట్టుకున్నారు. పోనీ అదన్నా సరిగా చేశారా అంటే అదీలేదు. ఇంతకీ ఆమె బాధ ఏమిటంటే ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి అన్నది పునరావాస పదవి కాకూడదట. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్ళే ఈ పదవికి న్యాయం చేయగలరట. కాబట్టి హిందు ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్ళని, హిందు ధర్మాన్ని ఆచరించేవాళ్ళనే ఛైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేశారు.

ఆమె ట్వీట్ ద్వారా చెప్పదలచుకున్నది ఏమిటంటే భూమన హిందువు కాదని. భూమనకు హిందు ధర్మం అంటే నమ్మకంలేదని, హిందు ధర్మాన్ని ఆచరించరని చెప్పాలన్నదే ఆమె ఉద్దేశం. అయితే ఆ విషయాన్ని డైరెక్టుగానే చెప్పవచ్చు కానీ చెప్పలేదు. సూటిగా చెప్పటానికి ఎందుకో భయపడినట్లున్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే టీటీడీకి భూమన ఛైర్మన్ అవ్వటం ఇది రెండోసారి. మొదటిసారి 2006-2008లోనే ఛైర్మన్ అయ్యారు.

భూమన మొదటిసారి టీటీడీకి ఛైర్మన్ అయినపుడు పురందేశ్వరి ఎంపీగా ఉన్నారు. అంటే అప్పట్లో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అప్పట్లో భూమన నియామకంపై పురందేశ్వరి ఏమీ మాట్లాడలేదు. అప్పట్లో టీటీడీ ఛైర్మన్‌గా భూమన నియామకం తప్పనిపించలేదు. అప్పట్లో భూమన హిందు ధర్మాన్ని ఆచరించేవారు, హిందు ధర్మాన్ని విశ్వసించేవారుగా కనిపించారు. అదే భూమనను ప్రభుత్వం ఇప్పుడు ఛైర్మన్‌గా నియమిస్తే హిందు ధర్మ వ్యతిరేకిగా, హిందు ధర్మంపై నమ్మకంలేని వ్యక్తయిపోయారు. అప్పుడూ ఇప్పుడూ భూమన ఒకేలాగున్నారు. మారింది పురందేశ్వరి మాత్రమే. అందుకనే నెటిజన్లు పురందేశ్వరిని గజనీ అని అంటున్నది.

First Published:  9 Aug 2023 5:57 AM GMT
Next Story