Telugu Global
Andhra Pradesh

స్నేహితుడు కాదు.. భర్తే చంపేశాడు- రాధా కేసులో కీలక మలుపు

అప్పటి నుంచి రాధా, మోహన్ రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కనిగిరి వస్తే అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లిస్తానని కాశీరెడ్డి చెప్పడంతో రాధా ఈనెల 17న వెళ్లిందని.. ఆ తర్వాత హత్యకు గురైందని తొలుత భావించారు.

స్నేహితుడు కాదు.. భర్తే చంపేశాడు- రాధా కేసులో కీలక మలుపు
X

ప్రకాశం జిల్లాలో ఇటీవల హత్యకు గురైన రాధా కేసు మిస్టరీ వీడింది. అనూహ్యంగా భర్తే హత్య చేయించినట్టు తేలింది. తొలుత ఆమె చిన్ననాటి స్నేహితుడిపై అనుమానాలు కలిగాయి. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో హత్య చేయించింది భర్తేనని నిర్ధారణ అయింది. రాధా అంత్యక్రియలు పూర్తి కాగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళపాడుకు చెందిన రాధాకు 2013లో నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన మోహన్‌ రెడ్డితో వివాహం అయింది. అతడు హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న త‌న చిన్ననాటి స్నేహితుడు కాశీరెడ్డికి రాధా 16 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ తర్వాత ఒక కంపెనీ ఏర్పాటు చేస్తానంటూ కాశీరెడ్డి చెప్పడంతో భర్త మోహన్ రెడ్డి నుంచి మరో 35 లక్షలు ఇప్పించింది. ఆ తర్వాత కాశీరెడ్డి ఆ డబ్బులు ఇవ్వలేదు. ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు విడిచి పారిపోయాడు.

అప్పటి నుంచి రాధా, మోహన్ రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కనిగిరి వస్తే అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లిస్తానని కాశీరెడ్డి చెప్పడంతో రాధా ఈనెల 17న వెళ్లిందని.. ఆ తర్వాత హత్యకు గురైందని తొలుత భావించారు. కాశీరెడ్డే హత్య చేయించి ఉంటారని అందరూ భావించారు. రాధా తల్లిదండ్రులూ అదే తరహాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా కాశీరెడ్డి ప్రమేయం లేదని నిర్ధారణ అయింది. పామూరు బస్టాండ్‌ వద్ద రాధాను తీసుకెళ్లేందుకు ఆరోజు వచ్చిన కారు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో వాటిని పోలీసులు పరిశీలించారు. దానికి తోడు హత్య తర్వాత మోహన్ రెడ్డి అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండటంతో పోలీసులు అతడిపై దృష్టి పెట్టారు.

కనిగిరికి రాధా వెళ్లిన సమయంలో ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన కారులో మోహన్ రెడ్డి ఉన్నట్టు పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అతడిని చూసే ఆమె కారు ఎక్కే విషయంలో షాక్‌ అయి రెండు అడుగులు వెనక్కు వేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కాశీరెడ్డి కాకుండా తన భర్త ఎందుకొచ్చారన్న అనుమానం ఆమెకు కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రాధా అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి ఫోన్‌ను పరిశీలించారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

స్నేహితుడు కాశీరెడ్డికి రాధా భారీగా డబ్బు ఇవ్వడం, అతడు తిరిగి ఇవ్వకపోవడంతో కోపంగా ఉన్న మోహన్ రెడ్డి.. తన భార్యకు కాశీరెడ్డికి మధ్య వివాహేతర సంబంధాలు కూడా ఉన్నట్టు అనుమానించాడు. నిర్ధారించుకునేందుకు ఒక కొత్త సిమ్ కొనుగోలు చేసి ఆ నెంబర్‌కు ట్రూకాలర్‌లో కాశీరెడ్డి పేరు వచ్చేలా చేసి.. ఇటీవల కాశీరెడ్డినంటూ భార్యతోనే మోహన్ రెడ్డి చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ చాటింగ్‌లో రాధా సమాధానాలతో మోహన్ రెడ్డికి అనుమానం మరింత పెరిగింది.

రాధాను చంపేందుకు ప్లాన్ చేశాడు. కాశీరెడ్డి పేరుతోనే చాటింగ్ చేసి ఒంటరిగా వస్తే డబ్బులు ఇస్తా అని నమ్మించి.. కనిగిరి రప్పించి బస్టాండ్ వద్ద ఎదురుచూస్తున్న రాధాను కారులో ఎక్కించుకుని మోహన్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు అనుమానం వచ్చినా భర్తే కావడంతో కారులో ఆ తర్వాత ఎక్కేసింది. అక్కడి నుంచి తీసుకెళ్లి టిడ్కో ఇళ్ల పక్కనే గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత రాత్రి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆమె బాడీపై కారును పదేపదే ఎక్కించి తొక్కించాడు. హత్యకు ముందు ఆమెను మోహన్ రెడ్డి కారులోనే చిత్రహింసలు పెట్టి గాయపరిచినట్టు భావిస్తున్నారు.

హత్య తర్వాత తన మామకు ఫోన్ చేసి మీకేమైనా క్లూ దొరికిందా అంటూ ఆరా తీశాడు. తాను వచ్చే వరకు రాధా ఫోన్‌ను ఎవరికీ ఇవ్వొద్దని చెప్పాడు. తొలుత అత్తమామలకు కూడా మోహన్ రెడ్డిపై అనుమానం రాలేదు. ఇప్పుడు ఈ కేసులో మోహన్ రెడ్డికి సహకరించిన ఇతర వ్యక్తులు ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడు కాశీరెడ్డికి భారీగా డబ్బులు ఇప్పించడం, అతడు తిరిగి చెల్లించకపోవడం, కాశీరెడ్డితో భార్యకు సంబంధాలున్నాయన్న అనుమానం కలిసి ఈ హత్యకు దారి తీశాయి.

First Published:  21 May 2023 2:23 AM GMT
Next Story