Telugu Global
Andhra Pradesh

ఆర్డీవో అరెస్ట్.. నెల్లూరు జిల్లాలో సంచలనం

కుంభకోణంలో ఆర్డీవో అవినీతికి పాల్పడినట్లు పూర్తి ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు సీఎస్ అనుమతి కోరగా అందుకు సీఎస్ అనుమతించారు.

ఆర్డీవో అరెస్ట్.. నెల్లూరు జిల్లాలో సంచలనం
X

నెల్లూరు జిల్లా సివిల్ సప్ల‌యిస్ కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణాన్ని తేల్చే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన అధికారులు రూ.40 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని గుర్తించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు తేలడంతో నాడు ఉమ్మడి నెల్లూరు జిల్లా సివిల్ సప్ల‌యిస్ కార్పొరేషన్‌లో ఎండీగా పనిచేసి ప్రస్తుతం సూళ్లూరుపేట ఆర్డీవోగా పని చేస్తున్న కేఎం రోజ్‌మండ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సివిల్ సప్ల‌యిస్ కుంభకోణంలో కేఎం రోజ్‌మండ్ కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును ఏసీబీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విచారణలో తవ్వే కొద్ది అవినీతి బట్టబయలవుతోంది. ప్రధాన నిందితుడు శివకుమార్ ప్రియురాలికి రెండు కేజీల బంగారం ఇచ్చినట్టు విచారణలో గుర్తించారు.

అలాగే కేఎం రోజ్‌మండ్ కుటుంబంలో ఒకరికి వివాహం జరగ్గా ఆ వివాహానికి రెండు కోట్ల రూపాయలు గిఫ్ట్ కూడా ఇచ్చినట్లు ఏసీబీ విచారణలో గుర్తించారు. కుంభకోణంలో ఆర్డీవో అవినీతికి పాల్పడినట్లు పూర్తి ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు సీఎస్ అనుమతి కోరగా అందుకు సీఎస్ అనుమతించారు. దీంతో కేఎం రోజ్‌మండ్‌ను బుధవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆర్డీవోకు జనవరి 4వరకు రిమాండ్ విధించింది.

ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రమేయం ఉన్నవారి ఆస్తులను గుర్తించి ప్రభుత్వం సీజ్ సైతం చేస్తోంది. త్వరలోనే ఆర్డీవో రోజ్‌మండ్ ఆస్తులను కూడా గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

వివాదాలకు కేంద్ర బిందువు రోజ్‌మండ్

ప్రస్తుతం సూళ్లూరుపేట ఆర్డీవోగా పనిచేస్తున్న రోజ్‌మండ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక శాఖలలో పని చేశారు. ఆమె పనిచేసిన ప్రతీ శాఖలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆమె సుప్రీంలా వ్యవహరిస్తుంటారని పలువురు ఆరోపిస్తున్నారు. రోజ్‌మండ్ అరెస్ట్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది

First Published:  22 Dec 2022 8:02 AM GMT
Next Story