Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు జ‌గ‌న్‌కు గురిపెడితే మోడీకి తగిలింది

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నీతిఆయోగ్ ప్రతిపాదించింది. 2019లో దాన్ని కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ చేసింది. అన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేయాలని కేంద్రం సూచించింది.

చంద్రబాబు జ‌గ‌న్‌కు గురిపెడితే మోడీకి తగిలింది
X

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయుధాన్ని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రయోగిస్తే అది ప్రధాని నరేంద్ర మోడీకి తగిలింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ చట్టాన్ని ఆసరా చేసుకుని భూములను వైఎస్ జగన్ లాక్కుంటారని ఆయన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి, ఆ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టం. అందువల్ల చంద్రబాబు చేసిన విమర్శ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే తగులుతుంది. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కూడా.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ సోషల్ మీడియా కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నాయి. తమ కూటమి అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది ఆయన చేతుల్లో లేదు. కేంద్రం చేతుల్లో ఉంది. తాను పొత్తు పెట్టుకున్న బీజేపీని ఆ చట్టం రద్దుకు చంద్రబాబు ఒప్పించగలరా అనేది ప్రశ్న. అంత దమ్ము ఆయనకు లేదనేది చాలాసార్లు రుజువైంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నీతిఆయోగ్ ప్రతిపాదించింది. 2019లో దాన్ని కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ చేసింది. అన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేయాలని కేంద్రం సూచించింది. అందువల్ల ఆ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయబోమనే హామీ అమలుకు నోచుకునేది కాదు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను మాత్రమే జారీ చేసింది. రాష్ట్రాలు దాన్ని అమలు చేయడానికి మార్గదర్శక సూత్రాలు జారీ కాలేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఆ చట్టంపై మాట్లాడుతూ పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు.

మరో తప్పుడు ప్రచారాన్ని కూడా టీడీపీ సాగిస్తోంది. భూవివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులో అపీల్ చేసుకోలేరని, హైకోర్టుకు మాత్రమే వెళ్లాలని అబద్ధాన్ని ప్రచారం చేస్తోంది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారం రిజిస్ట్రేషన్ అధికారి చేతుల్లో ఉంటుందని, ఆ అధికారి పాలక పార్టీ చెప్పినట్లే చేస్తాడని మరో అబద్ధపు ప్రచారాన్ని కూడా సాగిస్తోంది.

నిజానికి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారం టైటిల్ అప్పీలేట్ అథారిటీ ట్రిబ్యునల్ చేతుల్లో ఉంటుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆ ట్రిబ్యునల్ చెప్పినట్లే చేయాల్సి ఉంటుంది. భూవివాదాల విషయంలో రైతులు నేరుగా హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు అప్పిలేట్ అథారిటీకి వెళ్లవచ్చు. అప్పిలేట్ అథారిటీలో టైటిల్ రికార్డులు భద్రంగా ఉంటాయి.

మరో విషయాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చేయబోమని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. చట్టం అమలుపై అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికే వచ్చినప్పుడు మాత్రమే నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ కోర్టుల్లో ఇప్పటికే పిటిషన్లు వేశారని ఆయన చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

First Published:  1 May 2024 7:39 AM GMT
Next Story