Telugu Global
Andhra Pradesh

వైఎస్ జగన్‌ను పొగుడుతూ అంబటి రాయుడు ట్వీట్.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్

ఇన్నాళ్లూ పార్టీలకు అతీతంగా అభిమానించిన వాళ్లు మాత్రం ఇప్పుడు రాయుడిని ఆటాడుకుంటున్నారు. నీ ఆట నువ్వు చూసుకోక.. పాలిటిక్స్ అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

వైఎస్ జగన్‌ను పొగుడుతూ అంబటి రాయుడు ట్వీట్.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్
X

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న రాయుడు.. ఈ సీజన్ ముగిసిన తర్వాత ఆటకు పూర్తిగా గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. చాన్నాళ్లుగా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్న రాయుడు.. ఏపీ నుంచే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌ను కొన్నాళ్లుగా పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు రాయుడు.

సీఎం వైఎస్ జగన్ పథకాలను, వలంటీర్ల వ్యవస్థను పొగుడుతూ గతంలో ట్వీట్లు చేశాడు. తాజాగా అంబటి రాయుడు సీఎం జగన్ ప్రసంగానికి సంబంధించి వైసీపీ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన వీడియో ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ 'గ్రేట్ స్పీచ్ సీఎం వైఎస్ జగన్ గారూ.. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరు మీ మీద పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉన్నారు' అంటూ రాసుకొచ్చాడు.. అంబటి రాయుడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. త్వరలో వైసీపీలో జాయిన్ అవ్వాలనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టే రాయుడు ఇలా జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా, ఇన్నాళ్లూ పార్టీలకు అతీతంగా అభిమానించిన వాళ్లు మాత్రం ఇప్పుడు రాయుడిని ఆటాడుకుంటున్నారు. నీ ఆట నువ్వు చూసుకోక.. పాలిటిక్స్ అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ కూడా అస్సామ్ అయ్యిందా? ఇక పాలిటిక్సే మిగిలిందా..? అంటూ మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు. విజయ్ శంకర్‌ను నీ బదులు ఎంపిక చేయడం ఇప్పుడు మంచిదే అనిపిస్తోందని మరొకరు తమ కోపాన్ని వెలిబుచ్చారు. మొత్తానికి రాయుడు వైసీపీలో జాయిన్ అవడం ఇష్టం లేకనా..? లేదంటే రాజకీయాల్లోకి రావడమే ఇష్టం లేకనో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం అతడిపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

అంబటి రాయుడు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. రంజీల్లో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రా జట్టుకు కూడా ఆడాడు. టీమ్ ఇండియాలో చోటు దక్కినా.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. వరల్డ్ కప్‌కు ఎంపిక చేయనందుకు ఏకంగా సెలెక్టర్లపైనే విమర్శలు చేశాడు. ప్రస్తుతం రంజీల్లో బరోడా జట్టుకు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్‌కు ఆడుతున్నాడు. రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన కుటుంబానికి కూడా రాజకీయాలతో సంబంధం ఉంది. రాయుడు తాత వాళ్ల గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు. కాగా, రాయుడు క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వస్తారా? లేదంటే రెండు పడవలపై కాలు వేస్తాడా అనేది తెలియాల్సి ఉన్నది.


First Published:  19 April 2023 3:12 PM GMT
Next Story