Telugu Global
Andhra Pradesh

అదానీ గ్రూప్‌ డొక్కలో దూరిన మరో బాణం..

అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ కంపెనీలు జారీ చేసే బాండ్లకు ఎలాంటి విలువ లేదని క్రెడిట్ సూయిస్‌ సంస్థ తేల్చేసింది. వీటి బాండ్లకు సున్నా విలువను ప్రకటించింది.

అదానీ గ్రూప్‌ డొక్కలో దూరిన మరో బాణం..
X

వంద గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు కూలినట్టుగా అదానీ గ్రూప్ పరిస్థితి తయారైంది. అదానీ ఎంత అంటే ఈ దేశమంతా అన్నట్టుగా చెలరేగిన ఆ గ్రూప్‌ ఇప్పుడు అంతా అయిపోతున్నా.. చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని స్థితికి వచ్చేసింది. ఇప్పటికే హిండెన్‌బర్గ్ రిపోర్టు దెబ్బలకు లక్షల కోట్ల మేర ఆవిరైన అదానీ సంస్థ‌కు తాజాగా క్రెడిట్ సూయిస్‌ బాణం డొక్కలో దూకింది.

హిండెన్ బర్గ్ రిపోర్టు అదానీది బలుపు కాదు.. వాపు కాదు... అదో గాలి గొట్టం అని తేల్చడంతో.. ఆ గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. స్విట్టర్లాండ్ కేంద్రంగా పనిచేసే క్రెడిట్ సూయిస్‌ సంస్థ అదానీ గ్రూప్‌ బాండ్ల విలువ సున్నా అని తేల్చేసింది.

అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ కంపెనీలు జారీ చేసే బాండ్లకు ఎలాంటి విలువ లేదని క్రెడిట్ సూయిస్‌ సంస్థ తేల్చేసింది. వీటి బాండ్లకు సున్నా విలువను ప్రకటించింది. వాటి ఆధారంగా రుణాలు ఇస్తే అంతే సంగతి అని స్పష్టం చేసింది. ఈ మేరకు కథనాలు వస్తున్నాయి.

అదానీ బాండ్లకు విలువ లేదని క్రెడిట్ సూయిస్‌ తేల్చడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను వదిలించుకునే పక్రియ మరింత వేగం అందుకుంది. ఈ వార్తలతో బుధవారం అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ఏకంగా 30 శాతం వరకు నష్టపోయింది. దీంతో గత ఐదు సెషన్స్‌లో అదానీ గ్రూప్ మొత్తంగా రూ. 7 లక్షల కోట్ల రూపాయల విలువను కోల్పోయింది. గ్రూప్‌లోని మిగిలిన కంపెనీలు భారీ నష్టాలను నమోదు చేశాయి.

పెద్దల సలహాతో అదానీ చంకలో ఎక్కి మరీ కంపెనీల నోట్లో రుణాలు పెట్టిన బ్యాంకులకూ స్టాక్‌మార్కెట్‌లో చుక్కలు కనిపిస్తున్నాయి. తాము అదానీకి ఇచ్చిన అప్పు అరశాతమే అని ప్రభుత్వ రంగ బ్యాంకులు పదేపదే చెప్పినా ఇన్వెస్టర్లు మాత్రం ఆ మాటలను నమ్మలేదు. పీఎస్‌బీ బ్యాంకుల షేర్లను అమ్ముకునేందుకే మొగ్గు చూపారు.

అదానీతో స్నేహం చేసిన పాపానికి స్టాక్‌ మార్కెట్‌లో ఎస్‌బీఐ, పీఎన్‌బీ,యూబీఐ, ఇండియన్ బ్యాంకు, ఐఓబీ బ్యాంకుల షేర్లు 5 నుంచి 10 శాతం వరకు నష్టపోయాయి. అదానీ గ్రూప్ పతకం ఇంతటితో ఆగుతుందన్న ఆశలు కూడా లేవు. అదానీ పతనాన్ని రేటింగ్ సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. గ్రూప్ కంపెనీల పరపతి రేటింగ్‌ను సంస్థలు తగ్గించే అవకాశం ఉంది. హిండెన్‌బర్గ్ రిపోర్టు నేపథ్యంలో అదానీ విషయంలో ఆస్ట్రేలియా స్టాక్‌ మార్కెట్లు అప్రమత్తం అయ్యాయి. ఆ దేశ మార్కెట్ల నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగి అదానీ షేర్ల కదలికలను గమనిస్తున్నాయి.

First Published:  2 Feb 2023 3:19 AM GMT
Next Story