Telugu Global
Andhra Pradesh

మీ సొంత జిల్లాలోనే పరిస్థితి బాగోలేదు- జగన్‌కు ఎంపీ బినయ్ విశ్వం లేఖ

కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉండడం, వారు కూడా ఖాళీగా ఉండడం చూసి ఇంతటి తుపాను ఉంటే సిబ్బంది ఎక్కడున్నారని ప్రశ్నించారు.

మీ సొంత జిల్లాలోనే పరిస్థితి బాగోలేదు- జగన్‌కు ఎంపీ బినయ్ విశ్వం లేఖ
X

ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ జాతీయ నాయకుడు, రాజ్యసభ స‌భ్యుడు బినయ్ విశ్వం లేఖ రాశారు. కడప జిల్లాలో తుపాను సహాయక చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమ కోసం పార్టీ శ్రేణులు చేపట్టిన పాదయాత్ర కోసం బినయ్ విశ్వం కడప వచ్చారు. తుపాను కారణంగా పాదయాత్ర వాయిదా పడింది. దాంతో కడప వీధుల్లో పర్యటించిన బినయ్.. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించారు.

కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉండడం, వారు కూడా ఖాళీగా ఉండడం చూసి ఇంతటి తుపాను ఉంటే సిబ్బంది ఎక్కడున్నారని ప్రశ్నించారు. రెండో శనివారం కావడంతో సిబ్బంది రాలేదని వారు సమాధానం ఇచ్చారు. తుపాను సమయంలో సిబ్బందిని ఎందుకు అందుబాటులో ఉంచలేదని తెలుసుకునేందుకు కలెక్టర్‌కు ఫోన్ చేయగా ఆయన తీయలేదు.

కలెక్టర్ నెంబర్‌కు మేసేజ్ కూడా చేశారు. కానీ, స్పందన రాలేదు. దాంతో బినయ్ విశ్వం సీఎం జగన్‌కు మెయిల్‌లో లేఖ పంపారు. ఆ తర్వాత సీఎంవో అధికారులతో మాట్లాడి తుపాను సహాయ చర్యల్లో ఏమాత్రం చురుకుతనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో కలిసి పరిస్థితిని తాను పరిశీలించానని.. ఎక్కడా కూడా సహాయక చర్యలకు సిబ్బంది లేరని.. మీ సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పడానికి చింతిస్తున్నా అంటూ ముఖ్యమంత్రికి పంపిన లేఖలో ఎంపీ వివరించారు.

తాను కలెక్టర్‌కు ఫోన్ చేశానని, మేసేజ్ కూడా చేశానని.. తిరిగి స్పందించాలన్న మర్యాద కూడా లేకపోవడం బాధాకరమన్నారు. కలెక్టరేట్‌లో కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఖాళీగా కూర్చోవడాన్ని తాను చూశానని లేఖలో ప్రస్తావించారు. విపత్తుల సమయంలో ఇలాంటి నిర్లక్ష్యం ఏమాత్రం సరికాదని లేఖలో అభిప్రాయపడ్డారు.

First Published:  11 Dec 2022 2:12 AM GMT
Next Story