Telugu Global
Andhra Pradesh

అంబటి రాంబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. లక్కీ డ్రా వెనుక ఏం జరిగింది..?

అంబటి రాంబాబు మంత్రి కావడంతో పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయలేదు. దాంతో జనసేన నాయకుడు గాదే వెంకటేశ్వర‌రావు గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు.

అంబటి రాంబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. లక్కీ డ్రా వెనుక ఏం జరిగింది..?
X

వైయస్సార్ సంక్రాంతి లక్కీ డ్రాపై గుంటూరు కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి అంబటి రాంబాబుపై తక్షణం కేసు నమోదు చేయాలని పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున వైయస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టికెట్లను విక్ర‌యిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇదివరకే జనసేన నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ సచివాలయాలు కేంద్రంగా ఈ లక్కీ డ్రా టికెట్లను అమ్ముతున్నారని, వలంటీర్లకు టార్గెట్ పెట్టి మరి టికెట్ల అమ్మకాలు కొనసాగిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని, భారీగా ప్రజల నుంచి సొమ్ము వసూలు చేసే ఉద్దేశంతోనే ఈ పంథాను అనుసరిస్తున్నారని జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. భారీగా లక్కీ డ్రా టికెట్లు అమ్మాలని పైనుంచి టార్గెట్లు పెట్టడంతో వలంటీర్లు వృద్ధాప్య పింఛన్ల పంపిణీ సమయంలో ఒక్కో పింఛన్ దారు నుంచి 100 రూపాయలను ఈ లక్కీ డ్రా టికెట్ల కొనుగోలుకు మళ్ళించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

అంబటి రాంబాబు మంత్రి కావడంతో పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయలేదు. దాంతో జనసేన నాయకుడు గాదే వెంకటేశ్వర‌రావు గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. కోట్ల రూపాయలు వసూలు చేయాలన్న ఉద్దేశంతోనే మంత్రి అంబటి రాంబాబు కనుసన్నల్లోనే సచివాలయాలను కేంద్రంగా చేసుకొని వలంటీర్ల ద్వారా లక్కీ డ్రా టికెట్లను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నా.. పోలీసులు చర్యలు తీసుకోలేదని కోర్టుకు వివరించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు వెంటనే మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసుల్ని ఆదేశించింది. వైయ‌స్సార్ సంక్రాంతి లక్కీ డ్రాను అడ్డుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎన్ని టికెట్లు అమ్మారు..? ఎంత డబ్బును వసూలు చేశారు..? అన్నదానిపై విచారణ జరిపి కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది.

First Published:  11 Jan 2023 9:30 AM GMT
Next Story