Telugu Global
Andhra Pradesh

జగన్ సేఫ్ గేమ్.. కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం పొడిగింపు

వచ్చేది ఎన్నికల ఏడాది, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో ఏమాత్రం పొరపాట్లు జరిగినా ఆయా కులాల్లో వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. అందుకే జగన్ ఈసారి సేఫ్ గేమ్ ఆడారు.

జగన్ సేఫ్ గేమ్.. కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం పొడిగింపు
X

ఆంధ్రప్రదేశ్‌ లో బీసీ కార్పొరేషన్‌ చైర్మన్ల పదవీ కాలం పొడిగించారు. 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవి కాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వారు ఆయా పదవుల్లో కొనసాగుతారని చెప్పింది. వాస్తవానికి రెండేళ్ల కాలపరిమితికే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. ఇప్పుడు కొత్తవారికి అవకాశమివ్వకుండా పాతవారికే ఛాన్స్ ఇచ్చారు.

జగన్ సేఫే గేమ్..

వచ్చేది ఎన్నికల ఏడాది, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో ఏమాత్రం పొరపాట్లు జరిగినా ఆయా కులాల్లో వైసీపీకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి. అందుకే జగన్ ఈసారి సేఫ్ గేమ్ ఆడారు. పదవీకాలం ముగిసినా కూడా వారినే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ఆ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులేవీ లేవు. చైర్మన్లు, డైరెక్టర్లకు జీతాలు, ఆఫీస్, కార్, ఫోన్ అలవెన్స్ లు మాత్రమే ఉంటాయి. పైరవీలు చేసుకునేవారికి అవకాశాలున్నాయి, అది చేతగానివారు ఇంటిలో కూర్చుని జీతం తీసుకుంటున్నారు. ఇప్పుడు పదవీకాలం పొడిగించే సరికి హమ్మయ్య అనుకున్నారు.

మార్పు మంచిది కాదు..

మంత్రి వర్గ కూర్పు విషయంలోనే టీమ్-ఎ, టీమ్-బి అంటూ జగన్ ఓ ప్రయోగం చేశారు. అది సక్సెస్ అయిందా లేదా అనే విషయం పక్కనపెడితే చాలామంది అలకపాన్పు ఎక్కారు. అన్ని వర్గాలకు న్యాయం అంటున్న జగన్ అసలు కమ్మ వర్గానికి పదవే లేకుండా చేశారనే విమర్శ కూడా ఎదుర్కొన్నారు. అసంతృప్తుల్ని బుజ్జగించే క్రమంలో, కొత్తగా అసంతృప్తవర్గాన్ని కొనితెచ్చుకున్నట్టయింది జగన్ పరిస్థితి. దీంతో ఈసారి కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో జగన్ సేఫ్ గేమ్ ఆడారు. ఇప్పటికిప్పుడు కొత్తవారికి పదవులివ్వడం సాధ్యమయ్యే పనికాదు. కొత్తగా ఎవరిని తీసుకున్నా ఎన్నికల ఏడాదిలో ఆశావహుల్ని బుజ్జగించడం సాధ్యం కాదు. దీంతో పాతవారితోనే మమ అనిపించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అంటూ చిన్న కండిషన్ పెట్టి, తోక జాడించేవారి విషయంలో కఠినంగా ఉంటాననే సంకేతం పంపించారు. మొత్తమ్మీద జగన్ పదవుల మార్పు అనే తేనెతుట్టె కదల్చకుండా జాగ్రత్తపడ్డారు.

First Published:  21 Jan 2023 12:42 PM GMT
Next Story