Telugu Global
Andhra Pradesh

విజయవాడ వైసీపీలో జోడు పదవుల వివాదం

నిజానికి విజయవాడ మేయర్‌గా పుణ్యశీలకు చాన్స్ వస్తుందని అందరూ భావించారు. కానీ ఆఖరిలో భాగ్యలక్ష్మికి అవకాశం ఇచ్చారు. అడపా శేషు డిప్యూటీ మేయర్ పదవి ఆశించారు.

విజయవాడ వైసీపీలో జోడు పదవుల వివాదం
X

విజయవాడ వైసీపీలో కొందరు పరస్పరం గోతులు తవ్వుకుంటున్నారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ పుణ్యశీల .. విజయవాడ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు. అలాగే ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్‌ అడపా శేషు కూడా కార్పొరేటర్‌గా ఉన్నారు. వీరిద్దరు జోడు పదవుల్లో ఉన్నారని.. కాబట్టి కార్పొరేటర్‌లుగా అనర్హత వేటు వేయాలంటూ విజయవాడకు చెందిన ఒక ప్రజాప్రతినిధి చక్రం తిప్పారని ఆరోపణలు వస్తున్నాయి. దాంతో వీరిద్దరిపై వేటు వేయాలంటూ విజయవాడ ఉన్నతాధికారులకు.. మున్పిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్‌ డెవలప్‌మెంట్ నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి.

దాంతో విషయాన్ని పుణ్యశీల సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అడపా శేషు ఇది వరకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. నిజానికి విజయవాడ మేయర్‌గా పుణ్యశీలకు చాన్స్ వస్తుందని అందరూ భావించారు. కానీ ఆఖరిలో భాగ్యలక్ష్మికి అవకాశం ఇచ్చారు. అడపా శేషు డిప్యూటీ మేయర్ పదవి ఆశించారు. వారిద్దరికి అవకాశం రాకపోవడంతో అందుకు ప్రతిఫలంగా కార్పొరేషన్‌ పదవులు ఇచ్చారు.

రెండున్నరేళ్ల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్లను మారిస్తే ఈ సారి పుణ్యశీల, అడపా శేషుకు అవకాశం వస్తుందన్న భావనతో.. ఆ అవకాశం లేకుండా చేసేందుకు కార్పొరేటర్లుగా వీరిపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ప్రజాప్రతినిధే పావులు కదుపుతున్నారు. తనకు నచ్చిన వ్యక్తులే మేయర్, డిప్యూటీ మేయర్లు ఉండాలన్న ఉద్దేశంతోనే సదరు ప్రజాప్రతినిధి ఇలా తమకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసి అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని పుణ్యశీల సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అలా ఏమీ జరగదని.. తాను చూసుకుంటానని జగన్ ఆమెకు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.

First Published:  3 Oct 2022 2:00 AM GMT
Next Story