Telugu Global
Andhra Pradesh

ఏపీకి ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

2024లో వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ఆ నిర్ణయం తన పరిధిలో లేదని రాహుల్ చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో పూర్తిగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. విభజనకు కాంగ్రెసే కారణమంని భావించిన ఏపీ ప్రజలు ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలిపించకుండా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో మనుగడలో లేకుండా పోయింది. అయితే భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ పార్టీకి పునరుజ్జీవం తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్నది. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర విభజన వల్ల పార్టీకి కలిగిన నష్టాన్ని నేను గ్రహించాను. మేం అధికారంలోకి వస్తే విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా, పోలవరం వంటి విషయాలలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. నేను గతం గురించి మాట్లాడాలని భావించడం లేదు. కానీ భవిష్యత్‌లో ఏమీ చేయాలో నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఆనాడు రెండు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చవలసిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.

ఏపీకి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అధికార వైఎస్ఆర్‌సీపీ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పని ఆయన అన్నారు. ఏపీకి ఒకటే రాజధాని ఉండాలి. అది అమరావతి అయి ఉండాలని రాహుల్ చెప్పారు. మా పార్టీ స్టాండ్ కూడా అదేనని రాహుల్ అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై తప్పకుండా పోరాటం చేస్తామన్నారు.

2024లో వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ఆ నిర్ణయం తన పరిధిలో లేదని రాహుల్ చెప్పారు. ఎన్నికలు, పొత్తులు వంటి నిర్ణయాలన్నీ ఏఐసీసీ అధ్యక్షుడు తీసుకోవల్సిన నిర్ణయమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలు, రైతుల పరిస్థితి చూస్తే తనకు చాలా బాధగా ఉందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలోని ఏ పార్టీ కూడా వాళ్ల గురించి పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందారు. మూడు పార్టీలు కూడా కార్పొరేట్ కంపెనీల్లాగా వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

ఏపీలో భారత్ జోడో యాత్ర విజయవంతం అవుతుందో లేదో అని మా పార్టీ నాయకులు భావించారు. కానీ ఇక్కడి ప్రజల నుంచి అద్బుతమైన స్పందన వచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి ఈ యాత్ర తొలి అడుగుగా భావిస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు.

First Published:  20 Oct 2022 1:40 AM GMT
Next Story