Telugu Global
Andhra Pradesh

చిరంజీవికి ఐడీ కార్డు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ

చిరంజీవిని 2027 వరకు ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ ఈ ఐడీ కార్డ్ జారీ చేయడం విశేషం. ఏపీలోని ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరు పీసీసీ డెలిగేట్స్ ఉంటారు. చిరంజీవికి కొవ్వూరు సెగ్మెంట్ నుంచి డెలిగేట్‌గా అవకాశం ఇచ్చారు.

చిరంజీవికి ఐడీ కార్డు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ
X

మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు జారీ చేసింది. త్వరలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులకు ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అందరికీ ఐడీ కార్డులు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే చిరంజీవి పేరు మీద కూడా తాజాగా ఐడీ కార్డు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ-2022/104 నెంబర్‌తో చిరంజీవికి కొత్త ఐడీ కార్డు ఇవ్వగా.. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు ఐడీ కార్డులో పేర్కొన్నారు. కాగా, చిరంజీవిని 2027 వరకు ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ ఈ ఐడీ కార్డ్ జారీ చేయడం విశేషం. ఏపీలోని ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరు పీసీసీ డెలిగేట్స్ ఉంటారు. చిరంజీవికి కొవ్వూరు సెగ్మెంట్ నుంచి డెలిగేట్‌గా అవకాశం ఇచ్చారు.

తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని గతంలోనే చిరంజీవి ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగియక ముందు నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. క్రియాశీల రాజకీయాలకు కూడా ఆయన దూరమైనట్లు తెలుస్తూనే ఉంది. కాగా, మంగళవారం తన కొత్త సినిమా గాడ్ ఫాదర్ డైలాగ్ వైరల్‌గా మారింది. 'నేను రాజకీయాలకు దూరం అయ్యాను. కానీ రాజకీయాలు నాకు దూరం కాలేదు' అనే డైలాగ్ విడుదలై 24 గంటలు గడవక ముందే.. అచ్చం అలాగే జరగడం గమనార్హం. తాను రాజకీయాల్లో లేను బాబోయ్ అని చిరంజీవి చెప్తుంటే.. కాంగ్రెస్ మాత్రం మీరు మా పార్టీలోనే ఉన్నారంటూ ఏకంగా ఐడీ కార్డు విడుదల చేయడం విశేషం.

కాగా, చిరంజీవికి ఈ ఐడీ కార్డుకు సంబంధం లేదని తెలుస్తోంది. ఏఐసీసీ తమ లిస్టులో ఉన్న డెలిగేట్స్ అందరి ఐడీ కార్డులు జారీ చేస్తోందని.. ముందుగా చిరంజీవిని అడిగి కార్డు జారీ చేయలేదని తెలుస్తోంది. కార్డు చేతికి వచ్చే వరకు చిరంజీవికి కూడా ఆ విషయం తెలియకపోవచ్చని అంటున్నారు. తాను రాజకీయాలకు దూరంగానే ఉన్నానని చిరంజీవి పలుమార్లు చెప్పారని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనక పోవచ్చని తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన దగ్గర నుంచి చిరంజీవి ఆ పార్టీ సభ్యుడుగా ఉన్నారు. సాంకేతికంగా చిరంజీవి ఏనాడూ పార్టీకి రాజీనామా చేయలేదు. అందుకే ఆయన పేరు మీద ఏఐసీసీ ఐడీ కార్డు విడుదల చేసింది. అంతే కానీ చిరంజీవి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతారనే ప్రచారం అవాస్తవమని తెలుస్తుంది. తాను రాజకీయాల్లోకి రాను.. సినిమాలే చేసుకుంటానని గతంలో పలుమార్లు చెప్పారు. కాగా, ఈ కార్డు విషయంలో చిరంజీవి స్పందించాల్సి ఉన్నది.

First Published:  21 Sep 2022 12:42 PM GMT
Next Story