Telugu Global
Andhra Pradesh

వైసీపీ మద్దతు తీసుకుంటారా అన్న ప్రశ్నకు రాహుల్ సమాధానం

తన యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నానని చెప్పారు. యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నానని వివరించారు. ప్రతి భారతీయుడికి ప్రతీకగా నిలిచే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు.

వైసీపీ మద్దతు తీసుకుంటారా అన్న ప్రశ్నకు రాహుల్ సమాధానం
X

తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు తనను నిన్న కలిశారని.. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందన్నారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. ఏపీకి మూడు రాజధానుల ఆలోచన సరైనది కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామన్నారు. ఏపీకి హామీ ఇచ్చింది భారత ప్రభుత్వమని.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు.

తన యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నానని చెప్పారు. యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నానని వివరించారు. ప్రతి భారతీయుడికి ప్రతీకగా నిలిచే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ప్రజలు చెప్పే విషయాన్ని వినే గుణం ఒక్క కాంగ్రెస్‌లో మాత్రమే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ మద్దతు తీసుకుంటారా అన్న ప్రశ్నకు.. ఆ ప్రశ్న తన పరిధిలోకి రాదని.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు, పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రాహుల్ సమాధానం ఇచ్చారు.

బీజేపీ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు రైతుల మీద జీఎస్‌టీ భారం మోపారని విమర్శించారు. ఈ దేశ సంపదను పేదలు, మధ్య తరగతి ప్రజల నుంచి అత్యంత ధనికులుగా ఉన్న వారి చేతుల్లో మళ్లిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే మూడో ధనికుడిగా ప్రధాని మోడీ స్నేహితుడు ఎలా కాగలిగారో దేశంలో అందరికీ తెలుసన్నారు. సామాన్యులు, రైతులు, చిరు వ్యాపారులకు బ్యాంకు రుణాలు దొరకడం లేదు గానీ.. మోడీ అనుకూల సంపన్నులకు మాత్రం బ్యాంకులు లిమిట్ లేకుండా రుణాలు ఇచ్చేస్తున్నారని రాహుల్ వివరించారు.

First Published:  19 Oct 2022 8:58 AM GMT
Next Story