Telugu Global
Andhra Pradesh

షర్మిల ముందు 3 ఆప్షన్లు పెట్టిందా..?

పార్టీని ఇన్ స్టంట్ గా బలోపేతం చేయటంలో భాగంగానే వైసీపీ, టీడీపీలోని అసంతృప్తులకు గాలమేయాలని ఇప్పటికే సూచించారట. ఎందుకంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులను గమనిస్తే కనీసం 20 మందికి టికెట్లు దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది.

షర్మిల ముందు 3 ఆప్షన్లు పెట్టిందా..?
X

వైఎస్ షర్మిలను తొందరలోనే ఏపీ కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం మళ్ళీ మంతనాలు మొదలుపెట్టింది. మంగళవారం లేదా బుధవారం ఢిల్లీకి రావాలని కబురుచేసిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే షర్మిల ముందు కాంగ్రెస్ అధిష్టానం మూడు ఆప్షన్లుంచినట్లు తెలిసింది. అవేమిటంటే కర్నాటక లేదా తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ అయి పార్టీ పగ్గాలు అందుకోవటం. రెండోది ఏమిటంటే పార్టీ పగ్గాలు అందుకుని కడప లోక్ సభకు పోటీచేయటం. ఇక మూడో ఆప్షన్ ఏమిటంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత రాజ్యసభకు నామినేట్ అవ్వటం.

ఈ మూడు ఆప్షన్లలో షర్మిల దేన్ని కోరుకుంటారో చర్చించేందుకు ఢిల్లీకి రమ్మని కబురందిందట. అన్నీ కుదిరితే 7వ తేదీన షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని సమాచారం. షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత సీపీఐ, సీపీఎంతో కలిపి పొత్తు పెట్టుకోవాలని అధిష్టానం పెద్దలు సూచించబోతున్నారట. దీంతో ఏపీలో ఇండియా కూటమికి తలుపులు తెరుచుకున్నట్లవుతుంది.

ఇదే సమయంలో పార్టీని ఇన్ స్టంట్ గా బలోపేతం చేయటంలో భాగంగానే వైసీపీ, టీడీపీలోని అసంతృప్తులకు గాలమేయాలని ఇప్పటికే సూచించారట. ఎందుకంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులను గమనిస్తే కనీసం 20 మందికి టికెట్లు దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. అలాగే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మారుస్తున్నారు. నియోజకవర్గాలు మారేవారు మరో 20 మంది ఉంటారు. అలాగే మరో 10 మంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీచేయించబోతున్నారు. ఇదే సమయంలో టీడీపీ+జనసేన పొత్తు కారణంగా కొందరు సీనియర్ తమ్ముళ్ళకు చంద్రబాబునాయుడు టికెట్లు ఇవ్వలేరు. ఈ విషయమై ఇప్పటికే కొందరు తమ్ముళ్ళలో అసంతృప్తి మొదలైంది.

పై రెండు పార్టీల్లోని అసంతృప్తులతో టచ్ లోకి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఆఫర్ చేస్తే చాలామంది పార్టీలో చేరే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. ఇలాంటి విషయాలన్నింటినీ మాట్లాడేందుకే అధిష్టానం షర్మిలను ఢిల్లీకి రమ్మన్నదట. మరి అధిష్టానంతో చర్చల్లో షర్మిల ఏ ఆప్షన్ ఎంచుకుంటారు..? ఎంట్రీ ముహూర్తం ఎప్పుడుంటుందో చూడాలి.

First Published:  1 Jan 2024 4:57 AM GMT
Next Story