Telugu Global
Andhra Pradesh

పప్పులో కాలేసిన కాంగ్రెస్ హైకమాండ్.. పార్టీలో లేని వ్యక్తికి పదవి

ప్రస్తుతం మరో నేతకు ఆ పదవి కట్టబెట్టారు.అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీకి సంబంధించి నూతనంగా నియమించిన కార్యవర్గంలో ఆ పార్టీలో లేని వ్యక్తికి పదవి కట్టబెట్టడం గమనార్హం.

పప్పులో కాలేసిన కాంగ్రెస్ హైకమాండ్.. పార్టీలో లేని వ్యక్తికి పదవి
X

కాంగ్రెస్ అధిష్టానం పప్పులో కాలేసింది. తమ పార్టీలో లేని వ్యక్తికి కూడా పదవి కట్టబెట్టింది. దీంతో ఆ నాయకుడు తాను కాంగ్రెస్ పార్టీలోలేనని క్లారిటీ ఇవ్వాల్సి వ‌చ్చింది. ఈ విచిత్ర పరిస్థితి ఏపీ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో బలోపేతం అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఏపీలోనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమించింది. కార్యవర్గాన్ని కూడా కొత్తగా నియమించింది.

నిజానికి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయం. ఆ పార్టీకి గత ఎన్నికల్లో ఎక్కడా డిపాజిట్ లు కూడా వచ్చినట్టు లేవు. రాష్ట్ర విభజనానంతరం పార్టీ ఏపీలో డీలా పడిపోయింది. ఉన్న క్యాడర్ అంతా.. వైసీపీలోకి వెళ్లిపోయింది. ఇంకొందరు నేతలు టీడీపీలో సర్దుబాటు అయ్యారు. వెరసి ఏపీలో కాంగ్రెస్ కు పెద్దగా నేతలెవరూ లేరు. ఏదో కొద్దిమంది జనాకర్షణ లేని నేతలు, ప్రజల్లో పెద్దగా పలుకుబడి లేని నాయ‌కులు మాత్ర‌మే ఆ పార్టీలోనే ఊగిసలాడుతున్నారు. నిన్న మొన్నటివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ పత్రికా ప్రకటనలు ఇస్తూ చేతులు దులుపుకొనేవారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో నేతకు ఆ పదవి కట్టబెట్టారు.అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీకి సంబంధించి నూతనంగా నియమించిన కార్యవర్గంలో ఆ పార్టీలో లేని వ్యక్తికి పదవి కట్టబెట్టడం గమనార్హం.

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి తమ పార్టీలోనే ఉన్నాడని.. అతడికి పీసీసీ సభ్యుడిగా పదవిని కట్టబెట్టారు. ఈ మేరకు ఆయనకు నూతన కమిటీకి సంబంధించిన జాబితాను పంపించడంతో షాక్ అయ్యారట. తాను కాంగ్రెస్ పార్టీలో లేనని.. ప్రస్తుతం టీడీపీలో ఉన్నానని ఆయన చెప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఆయన గతంలో నాలుగు ద‌ఫాలు కాంగ్రెస్ త‌ర‌పున ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు.

అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయనకు కాంగ్రెస్ పీసీసీలో చోటు కల్పించడం గమనార్హం. ఓ రాజకీయపార్టీ తమ పార్టీలో లేని వ్యక్తికి పదవి ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.

First Published:  25 Nov 2022 9:04 AM GMT
Next Story