Telugu Global
Andhra Pradesh

టీడీపీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగుందా..?

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని చాలా జిల్లాల్లో చంద్రబాబుపై తమ్ముళ్ళు మండిపోతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ నుండి వెళ్ళిపోవటమే చంద్రబాబుకు పెద్ద షాక్.

టీడీపీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగుందా..?
X

తెలుగుదేశం పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగుంది. సీనియర్ తమ్ముళ్ళలో చాలామంది గుంభనంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయో లేదో తెలీని అయోమయం ఒకవైపు, టికెట్లు దక్కకపోతే ఏమిచేయాలో తెలీని గందరగోళం మరోవైపు. వెరసి ఏ సీనియర్ నేతను కదిల్చినా పొత్తులో టికెట్ల ప్రకటన కోసమే ఎదురుచూస్తున్నట్లు అర్థ‌మైపోతోంది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే జనసేనతో పొత్తు కారణంగానే. జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీతో పొత్తుకోసం చంద్రబాబునాయుడు వెంపర్లాడుతుండటంతో తమ్ముళ్ళు మండిపోతున్నారు.

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని చాలా జిల్లాల్లో చంద్రబాబుపై తమ్ముళ్ళు మండిపోతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ నుండి వెళ్ళిపోవటమే చంద్రబాబుకు పెద్ద షాక్. ఎంపీ ప్రభావం విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంతోకొంత ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. నానితో పాటు తిరువూరులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కూడా వైసీపీలో చేరారు. నాని విజయవాడ ఎంపీగా, స్వామిదాస్ తిరువూరు ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నారు. టీడీపీలో సమస్య ఏమిటంటే.. ప్రతి నియోజకవర్గంలోనూ ముగ్గురు, నలుగురికి టికెట్లు ఆశచూపించి వాళ్ళతో చంద్రబాబు, లోకేష్ బాగా ఖర్చులు చేయించారు.

చివరి నిమిషంలో ఎవరో ఒక్క‌రికి టికెట్టిచ్చినా లేకపోతే ఆ సీటును జనసేనకు కేటాయించేసినా తమ్ముళ్ళ రియాక్షన్ ఎలాగుంటుందో ఊహించలేకపోతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్‌ దక్కకపోతే బోండా ఉమా, వంగవీటి రాధా ఎలా రియాక్టవుతారో తెలీదు. మైలవరంలో టికెట్ లేదని మాజీమంత్రి దేవినేని ఉమకు చెప్పేశారట. అలాగే నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి, గాజువాకలో పీలా గోవింద్, పల్లా శ్రీనివాస్, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణకు కూడా టికెట్ గ్యారంటీ లేదట. విజయనగరంలో అశోక్ గజపతిరాజు, కొవ్వూరులో కేఎస్ జవహర్, సత్తెనపల్లిలో కోడెల శివరామ్, నెల్లూరులో అబ్దుల్ అజీజ్ పొత్తుల ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు.

ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, పెనుకొండలో పార్ధసారధి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, కర్నూలు ఎంపీ సీటుతో పాటు ఆలూరు సీటు కూడా ఇవ్వాల్సిందే అని కోట్లసూర్యప్రకాష్ దంపతులు పట్టుబట్టారట. డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించటంపై కేఈ ప్రతాప్ తిరుగుబాటు చేశారు. శ్రీకాళహస్తిలో టికెట్ లేదని చెప్పేయటంతో బొజ్జల సుధీర్ రెడ్డి మండిపోతున్నారట. పై నియోజకవర్గాలపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి బయటకు వచ్చాయి. ఇంకా బయటపడనివి, జనసేన పొత్తులో టికెట్లు కోల్పోయే నేతల విషయం మెల్లిగా బయటపడుతుంది. అందుకనే టీడీపీ పరిస్థితి నివురు గప్పిన నిప్పులాగుందని అంటున్నది.

First Published:  25 Jan 2024 4:50 AM GMT
Next Story