Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకే కాదు, పవన్‌ కల్యాణ్‌కు చెమటలు పట్టిస్తున్న బీజేపీ

టీడీపీ, జనసేన కూటమితో కలిసి వెళ్లి విజయం సాధించి కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకుందామని బహుశా ఆమె ఆశపడి ఉంటారు. కానీ, ఆమె చేతనే 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు బీజేపీ పెద్దలు అభ్యర్థుల జాబితాను తయారు చేయిస్తున్నారు.

చంద్రబాబుకే కాదు, పవన్‌ కల్యాణ్‌కు చెమటలు పట్టిస్తున్న బీజేపీ
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పొత్తులపై ఏమీ తేల్చకుండా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బీజేపీ చెమటలు పట్టిస్తోంది. అంతేకాదు, టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ అగ్రనేత కాళ్లావేళ్లా పడ్డానని చెప్పుకున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కూడా చెమటలు పట్టిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను చంద్రబాబు కలిసి దాదాపు నెల గ‌డుస్తుంది. ఇప్పటి వరకు పొత్తుపై బీజేపీ ఎటూ తేల్చలేదు.

చంద్రబాబు భేటీ తర్వాత రేపో మాపో పవన్‌ కల్యాణ్‌ హస్తినకు వెళ్తారని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు ఆయనకు బీజేపీ పెద్దల‌ అపాయింట్‌మెంట్‌ లభించినట్లు లేదు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని ఇప్పటి వరకు ఏదో విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ, బీజేపీ వ్యవహారం చూస్తుంటే సందేహాలు పెరుగుతున్నాయి.

మరోవైపు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కంగు తినే విధంగా ఆ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమితో కలిసి వెళ్లి విజయం సాధించి కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకుందామని బహుశా ఆమె ఆశపడి ఉంటారు. కానీ, ఆమె చేతనే 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు బీజేపీ పెద్దలు అభ్యర్థుల జాబితాను తయారు చేయిస్తున్నారు. ఒక్కో సీటుకు ఇద్దరు లేదా ముగ్గురు పేర్లను సూచిస్తూ రాష్ట్ర బీజేపీ జాబితాను తయారు చేస్తోంది.

బీజేపీ పెద్దలు రాష్ట్ర నేతలతో ఆ జాబితా తయారు చేస్తుండడంతో పొత్తు విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు చెమటలు పడుతుండడం ఖాయం.

First Published:  4 March 2024 9:09 AM GMT
Next Story