Telugu Global
Andhra Pradesh

రాజధాని కోసం రాజీనామాలు.. టీడీపీ నేతల్లో గుబులు

విశాఖ కోసం ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అంత త్యాగం చేస్తుంటే.. మరి అమరావతి కోసం టీడీపీ నేతలు ఆమాత్రం సాహసం చేయడానికి సిద్ధపడలేరా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ ప్రశ్న బయటకు రాగానే టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది.

రాజధాని కోసం రాజీనామాలు.. టీడీపీ నేతల్లో గుబులు
X

విశాఖను పరిపాలనా రాజధానిగా ఉంచాలనే డిమాండ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి జేఏసీ నేతలకు అందించారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా రాజీనామాకు సై అన్నారు. విశాఖ కోసం ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అంత త్యాగం చేస్తుంటే.. మరి అమరావతి కోసం టీడీపీ నేతలు ఆమాత్రం సాహసం చేయడానికి సిద్ధపడలేరా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ ప్రశ్న బయటకు రాగానే టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది.

దమ్ముంటే రాజీనామా చేస్తారా..?

విశాఖ కోసం నేను రాజీనామా చేస్తా, దమ్ముంటే అమరావతి కోసం అచ్చెన్న రాజీనామా చేస్తారా అంటూ వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అచ్చెన్న అమరావతి కోసం రాజీనామా చేస్తే పోటీ చేయాల్సింది తిరిగి టెక్కలిలోనే. అంటే ఉత్తరాంధ్రలోనే. ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని వద్దు అనే నినాదంతో అచ్చెన్న రాజీనామా చేసి తిరిగి గెలగలరా..? గెలవలేరనే ధీమాతోనే వైసీపీ నేతలు ఆ సవాల్ విసిరారు. దీనికి టీడీపీ నుంచి ఇంకా స్పందన లేదు.

టీడీపీలో గుబులు..

విశాఖ కోసం వైసీపీ నేతలు రాజీనామాలకు సై అంటుంటే.. టీడీపీ నేతలపై పరోక్షంగా ఒత్తిడి పెరుగుతోంది. అమరావతి కోసం ఆమాత్రం రాజీనామాలు చేయలేరా అంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమరావతిపై తాడో పేడో తేలిపోతుందని, టీడీపీ నేతలు రాజీనామా చేసి అమరావతి రెఫరెండంగా పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం నోటి మాటగా కాకుండా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసేసరికి టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. రాజీనామాల వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే టెన్షన్‌వారిలో కనపడుతోంది.

మరోవైపు అమరావతి రైతులు మాత్రం వైసీపీ నేతల రాజీనామాల వ్యవహారంపై మండిపడుతున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకే రాజీనామాల పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు నాటకాలాడుతున్నారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రను కొనసాగించిన రైతులు, వర్షంలో కూడా గొడుగులు పట్టుకుని ముందుకు కదిలారు. రాజధానిపై పూటకోమాట మార్చిన నేతలను ఎవరూ నమ్మరని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శాపనార్థాలు పెట్టారు.

First Published:  8 Oct 2022 3:31 PM GMT
Next Story