Telugu Global
Andhra Pradesh

బెయిలిచ్చినా కండిషన్స్ అప్లై.. చంద్రబాబు నోటికి తాళం

చంద్రబాబు బెయిల్ పై బయటకొచ్చారంటే.. ఆయన ఏం మాట్లాడతారా అని ఆ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ చంద్రబాబుకి ఆ స్వేచ్ఛ లేదు, ఆయన ప్రెస్ మీట్లు పెట్టలేరు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అంటూ కోర్టు షరతులు విధించింది.

బెయిలిచ్చినా కండిషన్స్ అప్లై.. చంద్రబాబు నోటికి తాళం
X

చంద్రబాబుకి బెయిలొచ్చింది, కానీ కోర్టు కండిషన్లు పెట్టింది. ఆయన బెయిల్ పై బయటకు వచ్చినా మునుపటిలాగా జనంలోకి వెళ్లలేరు, పార్టీ ఆఫీస్ కి పోలేరు, ప్రెస్ మీట్లు పెట్టలేరు, జూమ్ మీటింగ్ ల వంటివాటి జోలికి వెళ్లలేరు. అంటే దాదాపుగా ఆయన ఆస్పత్రి లేదా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. మధ్యంతర బెయిల్ కి కోర్టు పలు షరతులు విధించింది.

అనారోగ్య కారణాలతో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన కంటికి ఆపరేషన్ జరగాల్సి ఉండటం, చర్మంపై పెరుగుతున్న దద్దుర్లకు ట్రీట్ మెంట్ తీసుకోవడం గురించి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలవుతారు. అయితే జైలునుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కంటి ఆపరేషన్, ఇతర చికిత్సలు పూర్తయిన తర్వాత ఇంటికి వస్తారు. నవంబర్ 27 వరకు చంద్రబాబు బెయిల్ పై బయట ఉండొచ్చు. 28వతేదీ తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి రావాల్సి ఉంటుంది.

నో ప్రెస్ మీట్స్..

చంద్రబాబు బెయిల్ పై బయటకొచ్చారంటే.. ఆయన ఏం మాట్లాడతారా అని ఆ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ చంద్రబాబుకి ఆ స్వేచ్ఛ లేదు, ఆయన ప్రెస్ మీట్లు పెట్టలేరు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అంటూ కోర్టు షరతులు విధించింది. స్కిల్ కేసుకి సంబంధించి సాక్షులను ప్రభావితం చేయకూడదు అని చెప్పింది. అనారోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

చంద్రబాబుకి ఇద్దరు డీఎస్పీలతో ఎస్కార్ట్ ఉంచాలి అని ప్రభుత్వం కోర్టుని అభ్యర్థించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అంటే చంద్రబాబు బయటకు వచ్చినా ఆయనకు ఇద్దరు డీఎస్పీలు ఎస్కార్ట్ గా ఉంటారు. ఇక బాబు Z+ సెక్యూరిటీ విషయంపై కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర నిబంధనలు అమలు చేయాలని సూచించింది. చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్యానించింది.

First Published:  31 Oct 2023 5:52 AM GMT
Next Story