Telugu Global
Andhra Pradesh

మీకిదే లాస్ట్ ఛాన్స్.. ప్రజల్లోకి వెళ్లండి.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హెచ్చరిక

వైఎస్ జగన్.. అభ్యర్థుల కంటే పార్టీనే ముఖ్యమని పలు మార్లు అంతర్గత సమీక్షల్లో చెబుతున్నారు. టార్గెట్ రీచ్ కావాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదని కూడా అంటున్నారు.

మీకిదే లాస్ట్ ఛాన్స్.. ప్రజల్లోకి వెళ్లండి.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హెచ్చరిక
X

ఏపీలో అధికార వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సీఎం జగన్ టార్గెట్ 175 అంటూ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇంతకు వరకు ఎవరికీ టికెట్ హామీ ఇవ్వకపోయినా.. జగన్ మాత్రం కొంత మంది విషయంలో మాత్రం కఠినంగా ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంత మందికి టికెట్లు దక్కుతాయో తెలియక చాలా మంది ఆందోళనలో ఉన్నారు. 175కి 175 గెలుచుకోవాలంటే కచ్చితంగా గెలుపు గుర్రాలనే జగన్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. అందుకే అంచనాలను అందుకోలేకపోతున్న కొంత మంది సీనియర్లపై జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది.

వైఎస్ జగన్.. అభ్యర్థుల కంటే పార్టీనే ముఖ్యమని పలు మార్లు అంతర్గత సమీక్షల్లో చెబుతున్నారు. టార్గెట్ రీచ్ కావాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదని కూడా అంటున్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారికే టికెట్లు దక్కుతాయని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు జగన్ గుర్తించారు. ముఖ్యంగా సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం లేదని తెలిసింది. ఇప్పటికే తెప్పించుకున్న నివేదికల ప్రకారం 27 మంది ఎమ్మెల్యేలు ఈ విషయంలో వెనుకబడినట్లు అర్థం అవుతోంది. వీరిని పిలిచి చిన్నపాటి క్లాస్ కూడా తీసుకున్నట్లు తెలుస్తున్నది.

కొన్నాళ్ల క్రితం జరిగిన పార్టీ వర్క్ షాప్‌లో ఈ ఎమ్మెల్యేల పని తీరును బహిరంగంగానే ప్రస్తావించారు. ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్లి పని చేయాలని, లేకపోతే టికెట్ రావడం కష్టమేననే సంకేతాలు కూడా పంపించారు. మీకిదే లాస్ట్ ఛాన్స్ అని.. ప్రజల్లోకి వెళ్లకపోతే ఇక ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభమని కాస్త కఠినంగానే మాట్లాడారు. ప్రజల్లో తిరిగే వారికి, మంచి ఆదరణ ఉన్న వారికే ఈ సారి టికెట్లు కేటాయిస్తామని, పార్టీ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని జగన్ తేల్చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఆందోళనలో పడినట్లు తెలుస్తున్నది, కొన్ని వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యల వల్ల గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనలేక పోయామని సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా జగన్ విననట్లు తెలుస్తున్నది.

రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతు ఉన్న వారికే టికెట్లు దక్కుతాయని జగన్ స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం పలు మార్గాల్లో క్షేత్ర స్థాయి సమాచారం తెప్పించుకుంటోంది. ఎమ్మెల్యేల పనితీరు, సామాజిక సమీకరణలు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల బలం వంటివి బేరీజు వేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంటే దాన్ని తగ్గించడానికి ఏమేం చేయాలనే సూచనలు కూడా రెడీ చేసింది. పార్టీ అంచనాలను అందుకోలేకపోతున్న ఎమ్మెల్యేలకు ఇప్పటికే వైఎస్ జగన్ స్వయంగా హెచ్చరికలు జారీ చేశారు. వారిపై ప్రతీ రోజు రిపోర్టులు అందుతున్నట్లు తెలుస్తున్నది.

ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువగా పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారే ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఇద్దరు, గత మంత్రివర్గంలో ఉన్న నలుగురు ఉన్నట్లు సమాచారం. వీరిని స్వయంగా జగన్ పిలిచి పని తీరు మార్చరకోవాలని చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులు పార్టీకి మైనస్ అవ్వొద్దని జగన్ భావిస్తున్నారు.అందుకే ముందుగానే అందరికీ టికెట్లపై హామీ ఇవ్వకుండా.. పని తీరు ఆధారంగా మాత్రమే టికెట్లు ఇస్తామని చెబుతున్నారు. మొత్తానికి జగన్ పట్టుదల చూస్తే రెండో సారి అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడుతున్నారో అర్థం అవుతోంది.

First Published:  3 Dec 2022 5:42 AM GMT
Next Story