Telugu Global
Andhra Pradesh

హాస్టల్స్‌లో పరిస్థితులు అన్నీ మారాలి : సీఎం వైఎస్ జగన్

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 759 సంక్షేమ అధికారులు, 80 కేర్ టేకర్ల పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 171 వెల్ఫేర్ ఆఫీసర్ల నియామకానికి కూడా ఆమోదం తెలిపారు.

సీఎం వైఎస్ జగన్
X

సీఎం వైఎస్ జగన్

ప్రభుత్వ వసతి గృహాల్లో ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ మారిపోవాలని.. విద్యార్థులు మరింత బాగా చదువుకోవడానికి, వారు ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చదువులు కొనలేని పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే ఎక్కువగా హాస్టల్స్‌లో చేరుతుంటారు. అక్కడ ఉండే అరకొర సౌకర్యాలతో వాళ్లు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వాటి నిర్వహణను మరింత మెరుగు పరచాలని అధికారులను సీఎం ఆదేశించారు. మహిళా, శిF సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టల్స్‌పై శుక్రవారం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 759 సంక్షేమ అధికారులు, 80 కేర్ టేకర్ల పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 171 వెల్ఫేర్ ఆఫీసర్ల నియామకానికి కూడా ఆమోదం తెలిపారు. అంగన్ వాడీల్లో డిసెంబర్ 1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్ అందించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని కేంద్రాల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. అంగన్‌వాడీల్లో టాయిలెట్ల నిర్వహణ, శుభ్రతకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

హాస్టల్స్‌లో ఉండే బంకర్ బెడ్స్, ఇతర సౌకర్యాలు నాణ్యంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 3013 చోట్ల ఉన్న గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను కలిపి నాడు-నేడు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 1366 చోట్ల నాడు-నేడు పనులు ప్రారంభించాలని సూచించారు. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన కర్నూలు జిల్లాలోని పలు హాస్టళ్లను తొలి దశలోనే బాగు చేయాలని సీఎం ఆదేశించారు. నాడు-నేడు తొలి దశ పనుల కోసం దాదాపు రూ. 1,500 కోట్లు.. మొత్తంగా రూ. 3,364 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. తొలి విడత పనులు జనవరి నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ చెప్పారు.

హాస్టల్స్‌లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు కిచెన్లను ఆధునీకరించాలని సీఎం చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే వస్తువుల నాణ్యతను పెంచాలని అన్నారు. హాస్టళ్లపై ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పు కనిపించాలని సీఎం ఆదేశించారు. మండలాల వారీగా పర్యవేక్షణ పద్దతిని ప్రవేశపెట్టాలని సీఎం చెప్పారు. హాస్టల్స్ నిర్వహణ, సమస్యలను ఫిర్యాదు చేయడానికి ప్రతీ హాస్టల్‌కు ఒక నెంబర్‌ను కేటాయించాలని, అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులకు నెంబర్ ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.



First Published:  18 Nov 2022 12:01 PM GMT
Next Story