Telugu Global
Andhra Pradesh

స్కూళ్ల నిర్వహణలో సచివాలయ సిబ్బందికి భాగస్వామ్యం..

స్కూళ్ల సమస్యలను పరిష్కరించడానికి 14417 టోల్ ఫ్రీ నెంబర్‌ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. దీనితోపాటు.. ప్రతి స్కూల్‌లో సమస్యల పరిష్కారం కోసం ఒక మొబైల్ నెంబర్‌ను డిస్‌ప్లే చేయాలని చెప్పారు సీఎం జగన్.

స్కూళ్ల నిర్వహణలో సచివాలయ సిబ్బందికి భాగస్వామ్యం..
X

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులను భాగస్వాముల్ని చేయాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. పాఠశాల విద్యపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో పాల్గొన్నారాయన. సీఎం సూచనల ప్రకారం ఇకపై ప్రతి వారం సచివాలయ సిబ్బంది స్కూళ్లను సందర్శించాల్సి ఉంటుంది. వెల్ఫేర్‌ అండ్ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు వారానికోసారి తమ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లాలి. నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోలతో సహా అప్ లోడ్ చేయాలి. నెలకోసారి ఏఎన్ఎం స్కూళ్లను సందర్శించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఈ నిబంధన ఉన్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో మరోసారి సచివాలయ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలివ్వాలని సూచించారు సీఎం జగన్. ఎంఈవోలలో ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాలు అప్పగించబోతున్నారు.

ఆడిట్ తప్పనిసరి..

నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్‌ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నెలకు ఒకసారి కచ్చితంగా ఆడిట్‌ జరగాలన్నారాయన. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అనేది కూడా ఉన్నతాధికారులు పరిశీలన చేయాలని, అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్‌ని కూడా వాడుకుంటూ పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. స్కూళ్ల సమస్యలను పరిష్కరించడానికి 14417 టోల్ ఫ్రీ నెంబర్‌ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. దీనితోపాటు.. ప్రతి స్కూల్‌కి సమస్యలను స్వీకరించి పరిష్కరించేందుకు ఒక మొబైల్ నెంబర్ ను డిస్ ప్లే చేయాలని చెప్పారు సీఎం జగన్.

విలేజ్ క్లినిక్‌లు, విద్యా కానుక..

వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక అందరికీ అందేలా చర్యలు చేపట్టాలన్నారు సీఎం జగన్. యూనిఫాం కుట్టు కూలీని కూడా విద్యాకానుక ప్రారంభం రోజే తల్లుల ఖాతాలో వేయాలన్నారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్‌ కమిటీలను యాక్టివేట్‌ చేయాలని చెప్పారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, స్కూళ్లలో తాగునీటి నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు. ఎప్పకప్పుడు విలేజ్‌ క్లినిక్‌ ద్వారా నివేదికలు పంపించాలన్నారు. స్కూళ్ల విషయంలో కూడా విలేజ్ క్లినిక్‌ల భాగస్వామ్యం ఉండాలని చెప్పారు సీఎం జగన్.

First Published:  12 Sep 2022 3:00 PM GMT
Next Story