Telugu Global
Andhra Pradesh

8న ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం.. అసెంబ్లీ టికెట్లపై తేల్చేస్తారా?

ఈ నెల 8న వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఎమ్మెల్యేల పని తీరును మరోసారి ప్రస్తావించే అవకాశం ఉందని.. ఎవరెవరికి టికెట్లు దక్కవో తేల్చేస్తారనే చర్చ జరుగుతున్నది.

8న ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం.. అసెంబ్లీ టికెట్లపై తేల్చేస్తారా?
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ దూకుడు చూస్తుంటే ముందస్తుకు వెళ్తారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైతే ముందస్తుపై ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోయినా.. పార్టీ శ్రేణులను మాత్రం ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, నియెజకవర్గ ఇంచార్జీలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతీ ఎమ్మెల్యే, మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని తేల్చి చెప్పేశారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారు.. ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతున్నారనే విషయాలపై ప్రతీ రోజు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడంపై నిర్లక్ష్యం చేస్తున్న ఎమ్మెల్యేలకు గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. దాదాపు 27 మంది ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రాంను లైట్ తీసుకున్నట్లు నివేదిక తన వద్ద ఉందని.. ఏదో మార్నింగ్ వాక్‌కు వెళ్లినట్లు వెళ్లి వస్తున్నారని కూడా జగన్ చెప్పారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని గతంలో హెచ్చరించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు ఇచ్చిన గడువు ముగిసిపోయినట్లే కనపడుతున్నది. ఈ నెల 8న వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఎమ్మెల్యేల పని తీరును మరోసారి ప్రస్తావించే అవకాశం ఉందని.. ఎవరెవరికి టికెట్లు దక్కవో తేల్చేస్తారనే చర్చ జరుగుతున్నది.

రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి, ఎమ్మెల్యేల పని తీరుపై నిత్యం సర్వేలు చేస్తున్నారు. ప్రతీ రోజు జగన్ టేబుల్ మీదకు ఈ రిపోర్టులు వస్తున్నాయి. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు తప్పకుండా ఇంటింటికి వెళ్లాలని గతంలోనే ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా సూచించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినా.. కార్యక్రమం మాత్రం ఆపవద్దని చెప్పారు. వాళ్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా మీ పని తీరు మెరుగు పరుచుకోవాలని కూడా జగన్ ఆదేశించారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. టార్గెట్ 175 అని పెట్టుకున్న జగన్.. ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను కూడా అదే రీతిన సిద్ధం చేస్తున్నారు. విజయం కోసం ఎంత కష్టమైనా పడాలని.. ఈ సారి గెలిస్తే మనం సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటామని చెప్పుకొస్తున్నారు. ఇంత మోటివేట్ చేస్తున్నా కొంత మంది మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. త్వరలో జరగబోయే సమావేశంలో వీరిపైనే ఫోకస్ ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది? ఎవరికి టికెట్లు కేటాయించాలి? అనే విషయాలపై అక్కడ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలు.. ఆ తర్వాత ఎన్నికల సంసిద్ధత తోనే సరిపోతుంది. అందుకే ఈ నెలలోనే ఎమ్మెల్యేలతో కీలక సమీక్ష నిర్వహించి.. ముందుగానే వారికి టికెట్ల విషయం స్పష్టం చేయబోతున్నారనే చర్చ జరుగుతున్నది. కొంత మంది ఇంచార్జీలు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నారు. మరి కొంత మంది తమ వారసులకు టికెట్లు కోరుతున్నారు. వీరి విషయంపై సమావేశంలో స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీకి ఇది చాలా కీలక సమావేశమని పార్టీ వర్గాలు అంటున్నాయి. సీఎం జగన్ ఈ సమావేశంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా ప్రకటించబోతున్నట్లు తెలుస్తున్నది.

First Published:  5 Dec 2022 1:34 AM GMT
Next Story