Telugu Global
Andhra Pradesh

రాజధాని పేరెత్తకుండా.. వైజాగ్ నుంచి సీఎం జగన్ పాలన?

ఏప్రిల్ నుంచి విశాఖ నుంచే పరిపాలన చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. మంత్రులు బొత్స, అమర్‌నాథ్‌ కూడా జగన్ త్వరలో విశాఖకు వస్తారని పదే పదే చెబుతున్నారు.

రాజధాని పేరెత్తకుండా.. వైజాగ్ నుంచి సీఎం జగన్ పాలన?
X

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులపై పట్టు వీడటం లేదు. ఇప్పటికే ప్రతిపక్షాలు మూడు రాధానులను ఒక బూచిగా చూపిస్తూ ఓట్లు దండుకునే పనిలో పడ్డాయి. రాజధానుల అంశం ప్రస్తుతం ఇంకా కోర్టుల్లోనే నానుతున్నది. మరోవైపు ముందస్తు ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనలో ఉన్న వైఎస్ జగన్‌కు ఈ రాజధానుల వ్యవహారం కొలిక్కి రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో సరి కొత్త వ్యూహానికి తెర తీసినట్లు తెలుస్తున్నది. అసలు రాజధాని పేరే ఎత్తకుండా.. విశాఖ నుంచే పరిపాలన చేస్తే ఎలా ఉంటుందనే భావనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం.

ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రికి అయినా.. రాష్ట్రంలో ఎక్కడైనా క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకునే వెసులు బాటు ఉంటుంది. అది రాజధానిలోనే ఉండాల్సిన అవసరం కూడా లేదు. గతంలో చంద్రబాబు అమరావతితో పాటు హైదరాబాద్‌లో కూడా క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నగర పరిధిలోనే కాకుండా నగర శివార్లలోని ఫామ్ హౌస్‌ను కూడా క్యాంపు కార్యాలయంగా మార్చి ప్రభుత్వం నుంచి నిర్వహణ ఖర్చులు తీసుకున్నారు.

ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే పద్దతిలో వెళ్లాలని అనుకుంటున్నారు. నిర్వహణ ఖర్చులు తీసుకోవడం సీఎం జగన్ ప్రాధాన్యత కాదు. కానీ అదొక క్యాంపు కార్యాలయంగా ఉంటే.. సీఎం అక్కడ నుంచి పరిపాలన సాగించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో పలువురు మంత్రులు కూడా సీఎం జగన్ విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తారని చెబుతున్నారు. అదే సమయంలో రాజధాని మార్పు ఉంటుందని మాత్రం బహిరంగంగా వ్యాఖ్యానించడం లేదు. సీఎం ఎక్కడి నుంచైనా పాలించే అవకాశం రాజ్యాంగం కల్పించింది. అలాగని, సీఎం ఉన్న ప్రాంతమే రాజధాని అనడానికి వీలుండదు. కానీ సీఎం అక్కడ ఉంటున్నారు కాబట్టి.. ఆ ప్రాంత ప్రజలు కూడా రాజధాని అనే భావనలో ఉంటారు.

చట్టపరంగా ఎదురవుతున్న సమస్యలను ఈ వ్యూహం ద్వారా పరిష్కరించే వీలుంటుందని జగన్ అనుకుంటున్నారు. దీనిపై ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లే అవకాశం లేదని, వెళ్లినా కోర్టులు కూడా కొట్టేస్తాయని భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విశాఖ నుంచే పరిపాలన చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. మంత్రులు బొత్స, అమర్‌నాథ్‌ కూడా జగన్ త్వరలో విశాఖకు వస్తారని పదే పదే చెబుతున్నారు. ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా ప్రకటించే వీలు లేకపోయినా.. విశాఖ నుంచి పరిపాలన మొదలు పెడితే ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఒక భరోసా ఇచ్చినట్లు ఉంటుందని జగన్ అనుకుంటున్నారు. అదే సమయంలో కర్నూలు ప్రజలు కూడా జగన్ రాజధానుల విషయంలో మాట తప్పరనే భావన కలిగించే వీలుంటుంది.

ఇప్పటికే విశాఖలో పలు ప్రభుత్వ భవనాలు సిద్ధమవుతున్నాయి. రిషికొండపై నిర్మిస్తున్న భవనాలు పూర్తి అయిన తర్వాత జగన్ అక్కడకు పరిపాలనను మారుస్తారని వైసీపీ వర్గాలు కూడా అంటున్నాయి. రాజధాని అని చెప్పకుండానే.. కొంత కాలం అక్కడి నుంచి పాలన చేసి.. ముందస్తుకు వెళ్తారని కూడా చర్చ జరుగుతున్నది. మొత్తానికి రాజధానుల బిల్లు మాటెలా ఉన్నా.. క్యాంపు కార్యాలయాల పేరుతో విశాఖ నుంచి పరిపాలన చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

First Published:  4 Jan 2023 3:15 AM GMT
Next Story