Telugu Global
Andhra Pradesh

ఆర్థిక వృద్ధిపై కేసీఆర్ సంతృప్తి.. ఐటీ విభాగానికి ప్రత్యేక ప్రశంసలు

దేశ జనాభాలో తెలంగాణ రెండున్నర శాతమే ఉన్నా, దేశ ఆదాయంలో తెలంగాణ వాటా 5 శాతం అని గణాంకాలు చెబుతున్నాయి. సొంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రథ‌మ స్థానంలో ఉంది.

ఆర్థిక వృద్ధిపై కేసీఆర్ సంతృప్తి.. ఐటీ విభాగానికి ప్రత్యేక ప్రశంసలు
X

తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక విషయాలకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై ప్రత్యేకంగా అధికారులతో చర్చించారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధిరేటు న‌మోదైన‌ట్లు అధికారులు సీఎంకు వివ‌రించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో 12.9 శాతం కోత పడిందని, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయం వృద్ధి చెందడం గమనార్హమని అన్నారు. కోతలేవీ లేకపోతే రాష్ట్ర ఆదాయంలో 22 శాతం వృద్ధి కనపడేదని చెప్పారు.

కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతోందని, రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే, తెలంగాణ జీఎస్డీపీ మరో 3 లక్షల కోట్ల రూపాయలు పెరిగి, 14.5 లక్షల కోట్లకు చేరుకునేదని కేబినెట్ లో చర్చ జరిగింది. దేశ జనాభాలో తెలంగాణ రెండున్నర శాతమే ఉన్నా, దేశ ఆదాయంలో తెలంగాణ వాటా 5 శాతం అని గణాంకాలు చెబుతున్నాయి. సొంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రథ‌మ స్థానంలో ఉంది.

ఐటీలో ఊహించని అభివృద్ధి..

ముఖ్యంగా ఐటీ రంగంలో ఊహించని రీతిలో జరిగిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇన్సెంటివ్‌ లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక వసతులు, శాంతిభద్రతలు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, మానవ వనుల లభ్యత వంటి వాటి వల్ల ఐటీ రంగంలో అభివృద్ధి సాధ్యమైంది. ఈ సంద‌ర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజన్‌ ను, అధికారుల‌ను సీఎం కేసీఆర్ ప్ర‌శంసించారు.

గతేడాది ఒక్క ఐటీరంగంలోనే లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయి. ఐటీ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే తెలంగాణ నెంబర్-1 స్థానంలో ఉందని ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కేబినెట్ కు తెలిపారు. ఉద్యోగాల విషయంలో బెంగళూరుని సైతం వెనక్కు నెట్టామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్లు మాత్రమే, గతేడాది ఈ ఆదాయం లక్షా 84వేల కోట్లు వరకు పెరిగింది. ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఆర్థిక శాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.

First Published:  12 Aug 2022 1:44 AM GMT
Next Story