Telugu Global
Andhra Pradesh

జగన్ వార్నింగ్ బాగానే పనిచేసింది.. మంత్రుల డోస్ పెరిగింది..

ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు ఫెయిలయ్యారంటూ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వారిలో కాస్త మార్పు కనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు విమర్శల డోస్ పెంచారు. చంద్రబాబు, లోకేష్ పై విరుచుకు పడుతున్నారు.

జగన్ వార్నింగ్ బాగానే పనిచేసింది.. మంత్రుల డోస్ పెరిగింది..
X

చంద్రబాబు జేబు దొంగ, చేపలమ్ముకునే అమ్మాయి దగ్గర డబ్బులు కాజేసేవాడు - మంత్రి కాకాణి

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు - మంత్రి ఆదిమూలపు సురేష్

బాబు, లోకేష్ క్షమాపణ యాత్రలు చేయాలి, దౌర్జన్యం, హత్యలు చేయడం.. వారి డీఎన్ఏ లోనే ఉన్నాయి - మంత్రి విడదల రజిని

జగన్ ను లోకేష్ ఏమైనా అంటే నాలుక కోస్తా - మంత్రి మేరుగు నాగార్జున

నిన్న ఒక్కరోజే ఏపీ మంత్రులు చంద్రబాబు, లోకేష్ పై చేసిన విమర్శలివి. మంత్రులే కాదు మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కూడా చంద్రబాబు, లోకేష్ పై గతంలోకంటే ఎక్కువగా ఫైరయ్యారు. 420, 210 అంటూ కామెంట్లు చేశారు. ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేశారు.

మంత్రుల్లో సడన్ మార్పు..

చంద్రబాబుపై ఏపీ మంత్రులకు సానుభూతి ఉందని చెప్పలేం కానీ, ఇటీవల కాలంలో మరీ ఆ స్థాయిలో విమర్శలు వినిపించడంలేదు. కనీసం టీడీపీ విమర్శలకు కూడా కౌంటర్లు పడటంలేదు. పూర్తిగా చప్పబడ్డారని చెప్పలేం కానీ, వారి స్పందనలు వైసీపీ కార్యకర్తలకు కూడా రుచించడంలేదు. సీఎం జగన్ కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే మంత్రులు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. మంత్రులు ఆయా శాఖలపై విమర్శలు వస్తేనే వివరణ ఇవ్వాలనుకోవడం సరికాదని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే వెంటనే గడ్డిపెట్టాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించారు. దీంతో ఏపీ మంత్రులు జూలు విదిల్చారు. డోస్ పెంచారు.

గతంలో ఎప్పుడూ వ్యక్తిగతంగా చంద్రబాబు, లోకేష్ ని టార్గెట్ చేయని మంత్రి కాకాణి.. ఈసారి చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు పేరు కూడా తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకి దొంగతనాలు అలవాటని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని, రాష్ట్రంలో చంద్రబాబు జన్మించడమే పెద్ద శాపమని ధ్వజమెత్తారు.

మరో మంత్రి మేరుగు నాగార్జున కూడా తీవ్ర స్థాయిలో లోకేష్ పై విరుచుకుపడ్డారు. జగన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేష్ కి లేదన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని, కానీ ఆయన దేశానికి ఆణిముత్యాల్లాంటి నాయకులను అందించారని చెప్పారు. లోకేష్ ఎక్కువగా మాట్లాడితే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు.

మొత్తమ్మీద జగన్ ఆశించినట్టుగానే మంత్రులంతా లైన్లోకి వచ్చారు. కానీ ఇది సడన్ రియాక్షనా.. లేక ఎప్పటికీ మంత్రుల నుంచి ఇదే స్థాయిలో స్పందన ఉంటుందా అనేది వేచి చూడాలి. ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ రాజకీయ విమర్శల డోసు మరింత పెరిగే అవకాశముంది.

First Published:  9 Sep 2022 2:34 AM GMT
Next Story