Telugu Global
Andhra Pradesh

గ్రానైట్ పరిశ్రమకు వరాలు, వేగంగా వెలిగొండ పనులు..

కరెంటు చార్జీలపై యూనిట్ కు 2 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్ఆర్ హయాంలో మాదిరిగానే శ్లాబ్ విధానం అమలులోకి తెస్తామన్నారు. గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గ్రానైట్ పరిశ్రమకు వరాలు, వేగంగా వెలిగొండ పనులు..
X

ఏపీ సీఎం జగన్, ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా గ్రానైట్ పరిశ్రమకు వరాలు కురిపించారు. కరెంటు చార్జీలపై యూనిట్ కు 2 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్ఆర్ హయాంలో మాదిరిగానే శ్లాబ్ విధానం అమలులోకి తెస్తామన్నారు. గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విధానంతో ఏడాదికి రూ.135 కోట్లు నష్టం వస్తున్నా.. పరిశ్రమల మంచికోసం తమ ప్రభుత్వం భరిస్తోందని చెప్పారు జగన్. చంద్రబాబు హయాంలో కరెంటు చార్జీలను పెంచి కంపెనీలను నష్టపరిచారని, తమ హయాంలో ఆ భారాన్ని తగ్గిస్తున్నామని అన్నారు.

వెలిగొండ పనుల్లో వేగం..

ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైందన్నారు సీఎం జగన్. వెలిగొండ ప్రాజెక్టు ఒకటి, రెండు టన్నెల్ పనులు వైఎస్ హయాంలో పరుగులు పెట్టాయని, చంద్రబాబు వచ్చిన తర్వాత నత్తనడకన సాగాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి టన్నెల్ పూర్తి చేశామని, రెండో టన్నెల్ ని 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామన్నారు జగన్. వెలిగొండ ప్రాజెక్టుతో జిల్లా రూపురేఖలు మారిపోతాయమని చెప్పారు. తాళ్లూరు మండలం శివరామపురంలోని మొగిలిగుండాల ప్రాజెక్ట్ కి బూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నామని తెలిపారు జగన్. చీమకుర్తిలో వైఎస్ఆర్, బూచేపల్లి సుబ్బారెడ్డి వంటి ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు జగన్.

95శాతం హామీల అమలు..

వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్ల కాలంలోనే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు సీఎం జగన్. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను గుర్తు చేశారు జగన్. పేదలు, రైతుల సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్సార్ అని అన్నారు జగన్, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు కూడా వైఎస్సారేనని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పేదలకు చదువులు అందించిన ఘనత దివంగత నేతకు సొంతం అని చెప్పారు. గాంధీ, అంబేద్కర్‌, పూలే, అల్లూరి, ప్రకాశం, వైఎస్ఆర్.. ఇలా మహనీయులను ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు జగన్.

Next Story