Telugu Global
Andhra Pradesh

న్యాయవాదుల ఖాతాల్లోకి 'లా నేస్తం' ఆర్థిక సాయం

యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏడాదికి 60వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి న్యాయవాదికి మూడేళ్లలో ఒక లక్షా 80వేల రూపాయల స్టైఫండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

న్యాయవాదుల ఖాతాల్లోకి లా నేస్తం ఆర్థిక సాయం
X

న్యాయవాదుల ఖాతాల్లోకి 'లా నేస్తం' ఆర్థిక సాయం

ఏపీ సర్కారు సంక్షేమ పథకాల అమలులో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రదర్శిస్తోంది. పథకాల పేరుతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా.. సర్కారు మాత్రం తగ్గేదేలే అంటోంది. ఈ ఏడాది వైఎస్సార్‌ లా నేస్తం ప్రోత్సాహకాన్ని నేడు విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ వ్యాప్తంగా అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు 5 వేల రూపాయల స్టైఫండ్‌ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 2023-24 సంవత్సరానికి మొదటి విడత 'వైఎస్సార్‌ లా నేస్తం' ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేడు విడుదల చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో ఈ స్టైఫండ్‌ జమ అవుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి- జూన్ మధ్య 5 నెలల కాలానికిగాను ఒక్కొక్కరికి 25వేల రూపాయల చొప్పున మొత్తం 6 కోట్ల 12 లక్షల 65 వేల రూపాయలను జమ చేయనున్నారు సీఎం జగన్.

యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏడాదికి 60వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి న్యాయవాదికి మూడేళ్లలో ఒక లక్షా 80వేల రూపాయల స్టైఫండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఏడాది తొలి స్టైఫండ్‌తో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు నాలుగేళ్లలో 41.52 కోట్ల ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం.

న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ. 100 కోట్లతో "అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్" ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ ద్వారా అందిస్తున్నారు. ఆర్థిక సాయం కోరే అడ్వకేట్స్ ఆన్‌లైన్‌లో sec_law@ap.gov.in ద్వారా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

First Published:  26 Jun 2023 4:59 AM GMT
Next Story