Telugu Global
Andhra Pradesh

ప్రజెంటేషనా..? కొత్త బిల్లా..? మూడు రాజధానులపై ఉత్కంఠ..!

అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు మూడు రాజధానులు ఎందుకు అనే విషయాన్ని సీఎం జగన్ స్పష్టంగా వివరించే అవకాశముంది. ఈ ప్రజెంటేషన్ తర్వాత కొత్త బిల్లు ప్రవేశపెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది.

ప్రజెంటేషనా..? కొత్త బిల్లా..? మూడు రాజధానులపై ఉత్కంఠ..!
X

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి హైలెట్ అవుతోంది. గతంలో అమరావతి రైతుల పాదయాత్ర పార్ట్-1 జరుగుతుండగా బిల్లుని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రైతుల పాదయాత్ర పార్ట్-2 జరుగుతున్న సందర్భంలో కొత్త బిల్లుతో సిద్ధమవుతోంది. ఏపీ అసెంబ్లీ తాజా సమావేశాల్లో ఇదే హాట్ టాపిక్.

వారం రోజులుగా మూడు రాజధానుల వ్యవహారంలో ప్రభుత్వం లీకులిస్తూ వస్తోంది. మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని చెప్పారు, బిల్లు రెడీ అవుతుందని అన్నారు, ఈ సమావేశాల్లో కాకపోయినా త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామన్నారు, చివరకు ఈ సమావేశాలేనని తేల్చేశారు. ఇప్పుడు సీఎం జగన్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సిద్ధమయ్యారని క్లారిటీ ఇచ్చేశారు.

ప్రజెంటేషనా..? బిల్లా..?

అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు మూడు రాజధానులు ఎందుకు అనే విషయాన్ని సీఎం జగన్ స్పష్టంగా వివరించే అవకాశముంది. అదే సమయంలో అమరావతి అభివృద్ధికి హైకోర్టు ఆదేశాలున్నాయి కాబట్టి, న్యాయపరమైన అంశాల జోలికి వెళ్లకుండా కేవలం మూడు ప్రాంతాల అభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశాలకే సీఎం పరిమితమవుతారని అంటున్నారు. ఈ ప్రజెంటేషన్ తర్వాత కొత్త బిల్లు ప్రవేశపెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది.

రెఫరెండం..

తాజాగా మూడు రాజధానులే రెఫరెండం అంటూ వైసీపీ మంత్రులు సవాళ్లు విసిరారు. మూడు రాజధానుల అజెండాతో ఎన్నికలకు వెళ్తామంటున్నారు. అదే అజెండా అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాల్సిన అవసరం లేదు. ముందస్తు ఎన్నికల ముచ్చటనూ కొట్టిపారేయలేం. మూడు రాజధానులను రెఫరెండంగా పెట్టి ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుని.. కొత్త ప్రభుత్వంలో తిరిగి సమగ్ర బిల్లు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

టీడీపీ వ్యూహం ఏంటి..?

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి తాను రానని స్పష్టం చేశారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడా తగ్గొద్దని సూచించారు. మూడు రాజధానుల విషయంలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్ వినిపించాలన్నారు. మూడు రాజధానుల విషయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహం వైసీపీకి ఉందో లేదో కానీ, ఇదే అదనుగా శాసన సభను రద్దు చేసి, ఎన్నికలు జరిపించాలనే ప్లాన్ చేస్తోంది టీడీపీ. మొత్తమ్మీద తాజా ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశముంది.

First Published:  15 Sep 2022 3:08 AM GMT
Next Story