Telugu Global
Andhra Pradesh

నేను హీరో, వాళ్లు విలన్లు.. సీఎం జగన్ చెప్పిన సినిమా స్టోరీ

వైరి వర్గాలను దుష్ట చతుష్టయం అంటూనే.. వాళ్లంతా తోడేళ్ల గుంపులా ఏకమవుతున్నారని, ప్రభుత్వంపై రాళ్లేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్.

నేను హీరో, వాళ్లు విలన్లు.. సీఎం జగన్ చెప్పిన సినిమా స్టోరీ
X

రాజకీయ ప్రసంగాల్లో పెద్దగా సినిమాల ప్రస్తావన తీసుకురారు సీఎం జగన్. కానీ తొలిసారిగా ఆయన సినిమాలతో రాజకీయాలను పోల్చారు. సినిమాల్లో ఉన్నట్టే రాజకీయాల్లో కూడా హీరోలు, విలన్లు ఉంటారని.. చివరకు హీరోలే అందరికీ నచ్చుతారని అన్నారు. ‘‘సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్లు కాదు.. చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. గతంతో పోలిస్తే ఈ బిడ్డ ప్రభుత్వంలో అప్పులు తక్కువ’’ అని అన్నారు సీఎం జగన్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేసిన ఆయన ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

Advertisement


తోడేళ్ల గుంపు..

వైరి వర్గాలను దుష్ట చతుష్టయం అంటూనే.. వాళ్లంతా తోడేళ్ల గుంపులా ఏకమవుతున్నారని, ప్రభుత్వంపై రాళ్లేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. అర్హతలేనివారంతే ఏకమై అధికారంకోసం వెంపర్లాడుతున్నారని, పొత్తులకోసం ఎత్తులు వేస్తున్నారన చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో చేసేది డైరెక్ట్‌ బెన్‌ ఫిట్‌ ట్రాన్స్ ఫర్(DBT) అయితే.. గత ప్రభుత్వంలో దోచుకో, పంచుకో, తినుకో..(DPT) అనేది జరిగిందని సెటైర్లు వేశారు జగన్.

Advertisement

కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన నిధులు.. రూ.698.68 కోట్లు జమ చేశారు సీఎం జగన్. పేదరికం నుంచి బయటపడాలంటే అది విద్యతోనే సాధ్యం అవుతుందన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువేనని చెప్పారు. పేదలు బాగుండాలనే ఉద్దేశంతోటే నవరత్నాలు ప్రవేశపెట్టామన్నారు. ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువేనని తెలిపారు. తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే తామే మాట్లాడతామని పేర్కొన్నారు. దేశంలో విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవని, కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదేనని అన్నారు. రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్‌ స్కూళ్లు పోటీ పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story