Telugu Global
Andhra Pradesh

జిత్తులమారే కాదు, పొత్తులమారి కూడా

"ఇటు వైపు నేను ఒక్కడ్నే..అటు వైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్‌.. నన్ను ఎదుర్కొనేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయి.." అంటూ విపక్షాలపై మండిపడ్డారు జగన్‌.

జిత్తులమారే కాదు, పొత్తులమారి కూడా
X

చంద్రబాబుని ఇప్పటి వరకూ జిత్తులమారి అనుకునేవారు, ఆయన పొత్తులమారి కూడా అంటూ సెటైర్లు పేల్చారు సీఎం జగన్. ఆ పొత్తులమారితో ఇప్పుడు నరకాసురుడు , రావణాసురుడు, దుర్యోధనుడు కూడా కలిశారంటూ మండిపడ్డారు. నంద్యాల బహిరంగ సభలో జగన్ మరోసారి కూటమిపై నిప్పులు చెరిగారు. గతంలో చంద్రబాబు అబద్ధాలు, మోసాలు అందరం చూశామని, బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రజల్ని ప్రశ్నించారు.


మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు..

చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి వెళ్లిపోతామని అన్నారు జగన్. ఎవరి పాలనలో మంచి జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలన్నారు. వైసీపీ హయాంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామని చెప్పారు. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామని, ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నామని, నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చామని, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామని వివరించారు సీఎం జగన్.

తోడేళ్ల గుంపు..

"ఇటు వైపు నేను ఒక్కడ్నే..అటు వైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్‌.. జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయి.." అంటూ విపక్షాలపై మండిపడ్డారు ముఖ్యమంత్రి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు.. 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. వరుసగా రెండు రోజుల బహిరంగ సభల్లో ఎక్కడా తన ప్రసంగంతో ప్రజలు నీరసపడకుండా చూసుకున్నారు జగన్. చెప్పిన విషయాల్నే చెప్పి చంద్రబాబులా విసిగించలేదు. తాను ఏం చేశాననే విషయాన్ని సూటిగా చెబుతున్నారు. చంద్రబాబు మళ్లీ ఎందుకు రాకూడదు అనే విషయాన్ని కూడా గట్టిగానే ప్రస్తావిస్తున్నారు. ప్రొద్దుటూరు సభలో స్థానికంగా సంచలనమైన వివేకా హత్యకేసుని ప్రస్తావించారు. నంద్యాలలో బాబు పొత్తుల ఎత్తులను దుయ్యబట్టారు.

First Published:  28 March 2024 1:30 PM GMT
Next Story