Telugu Global
Andhra Pradesh

టీచర్ల పిల్లలూ ప్రభుత్వ స్కూళ్లలో చదవాలనుకునేలా కృషి

టీచర్లు తలుచుకుంటే మొత్తం వ్యవస్థను మార్చగలరన్నారు. సానపట్టక ముందు వజ్రమైనా రాయిలాగే ఉంటుందని, మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా అద్భుతమైన శిల్పంగా మారుతుందన్నారు. అలాంటి శిల్పులే టీచర్లు అని సీఎం అన్నారు. ఒక మంచి టీచర్‌ మంచి విప్లవాన్ని కూడా తీసుకురాగలుగుతారన్నారు.

టీచర్ల పిల్లలూ ప్రభుత్వ స్కూళ్లలో చదవాలనుకునేలా కృషి
X

గత ప్రభుత్వం లాగా విద్యను అందించే బాధ్యత నుంచి తప్పుకుని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా తమ ప్రభుత్వం పనిచేయదన్నారు సీఎం జగన్‌. విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్.. గత ప్రభుత్వంలా తాము కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కు కాబోమన్నారు. ప్రభుత్వ బడికి గత వైభవాన్ని తీసుకురావాలనే తపనతోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టీచర్లు సైతం తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించే పరిస్థితులు రావాలన్న సంకల్పంతో కృషి చేస్తున్నామన్నారు.

టీచర్లు తలుచుకుంటే మొత్తం వ్యవస్థను మార్చగలరన్నారు. సానపట్టక ముందు వజ్రమైనా రాయిలాగే ఉంటుందని, మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా అద్భుతమైన శిల్పంగా మారుతుందన్నారు. అలాంటి శిల్పులే టీచర్లు అని సీఎం అన్నారు. ఒక మంచి టీచర్‌ మంచి విప్లవాన్ని కూడా తీసుకురాగలుగుతారన్నారు.

పిల్లల వ్యక్తిత్వాన్ని, వివేకాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచడంలో టీచర్‌ పాత్రే చాలా కీలకమన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా శాఖపై నిర్వహించినన్ని సమీక్షలు మరే శాఖపైనా నిర్వహించలేదన్నారు. మారుతున్న ప్రపంచంలో పోటీకి తగ్గట్టు పిల్లలను తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

చదువుల వల్ల పిల్లలకు భవిష్యత్తు ఉంటోందా లేక చదువు కేవలం పట్టా మాత్రమే ఇచ్చే వ్యవస్థలా ఉందా అన్నది పరిశీలన చేసుకోవాలన్నారు. తాము తెస్తున్న మార్పులు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో చేస్తున్నవి కాదన్నారు. పిల్లల భవిష్యత్తును మరింత పెరుగుపరిచేందుకు తీసుకువస్తున్న మార్పులుగానే చూడాలన్నారు.

గతంలో ఏనాడు ఉద్యోగులపై సానుభూతి చూపని ప్రతిపక్షం నేడు మాత్రం రెచ్చగొట్టే పనికి దిగుతోందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకు సానుకూలంగా ఒక్క మాట రాయని మీడియా ఇప్పుడు మాత్రం నిత్యం రెచ్చగొట్టేలా కుట్రచేస్తోందని వీటిని ఉపాధ్యాయులు గమనించాలని సీఎం జగన్ కోరారు.

First Published:  5 Sep 2022 7:05 AM GMT
Next Story