Telugu Global
Andhra Pradesh

సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యాయం - ఏపీ సీఎం జగన్..

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామన్నారు జగన్. దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని, అలాంటి మగ్గం నేసే నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా నిలబడుతోందని అన్నారు.

సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యాయం - ఏపీ సీఎం జగన్..
X

ఏపీలో ప్రస్తుతం సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యాయం మొదలైందని అన్నారు సీఎం జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేసిన ప్రభుత్వం తమదని అన్నారు. కేబినెట్‌ లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని చెప్పారు. మూడేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపామని, శాసన మండలి సీట్లను బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చామని, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. నేతన్న నేస్తం నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తమ హయాంలోనే చేనేత కార్మికులకు న్యాయం జరిగిందని చెప్పారు.

స్వాతంత్ర సమరాన్ని మగ్గం మార్చేసింది..

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామన్నారు జగన్. దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని, అలాంటి మగ్గం నేసే నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా నిలబడుతోందని అన్నారు. అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ద్వారా సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యాయానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. నేతన్నల కష్టాలను తన పాదయాత్రలో గమనించాన‌ని, అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చానని చెప్పారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ. 776.13 కోట్లు సాయం అందించామని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాది రూ.24 వేల చొప్పున.. నాలుగేళ్లలో రూ.96 వేలు సాయం అందించామని అన్నారు.

డైరెక్ట్ సాయం మా హయాంలోనే..

గతంలో ఏ ప్రభుత్వ పథకం అయినా లంచాలకు అవకాశం ఉండేదని, ఇప్పుడు నేరుగా బటన్ నొక్కడం ద్వారా అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని, ఈ-కామర్స్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక వర్గానికే ప్రాధాన్యమిచ్చారని, తమ హయాంలో అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్నామని అన్నారు జగన్. నాకు వీళ్ళమాదిరిగా పత్రికలు, టీవీ ఛానెళ్ళు లేవని, ప్రజలే తన మీడియా అని అన్నారు జగన్.

First Published:  25 Aug 2022 12:22 PM GMT
Next Story