Telugu Global
Andhra Pradesh

జగన్ నమ్మకాన్ని పెంచిన ఆరోగ్య సురక్ష

వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రత్యేకంగా అధికారులతో చర్చించారు సీఎం జగన్. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి మండలంలో జనవరి 1నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు.

జగన్ నమ్మకాన్ని పెంచిన ఆరోగ్య సురక్ష
X

ఇటీవల కాలంలో ఏపీ సీఎం జగన్ ఎక్కువగా భరోసా పెట్టుకున్న కార్యక్రమం ఆరోగ్య సురక్ష. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత నిరాటంకంగా కొనసాగింది. ప్రజల నుంచి స్పందన కూడా బాగుందని తెలుస్తోంది. ఆరోగ్య సురక్ష ద్వారా తమపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి నమ్మకమే అధికార పార్టీకి అవసరం. అందుకే ఆరోగ్య సురక్ష రెండో విడతకు కూడా శ్రీకారం చుడుతున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ప్రత్యేకంగా అధికారులతో చర్చించారు సీఎం జగన్. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి మండలంలో జనవరి 1నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే ప్రతి సచివాలయ పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. రెండో విడతలో మండల కేంద్రంలో ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

తొలిదశ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు ఏఎన్ఎంలు. సచివాలయ పరిధిలో ఎవరికి ఎలాంటి సమస్యలున్నాయో తెలుసుకున్నారు. అవసరమైనవారికి వెంటనే వైద్యసాయం అందించారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న ఆస్పత్రులకు రిఫర్ చేశారు. ప్రతి సచివాలయ పరిధిలో క్యాంపులు ఏర్పాటు చేసి మందులు అందించారు. రెండో విడతలో మండలాల్లో ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1.42 కోట్ల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది. ఈ నెల 18 నుంచి కార్డుల పంపిణీ మొదలవుతుంది. ప్రజల ఆరోగ్యంపై మరింత దృష్టిపెట్టాలని సమీక్షలో తెలియజేశారు సీఎం జగన్. వివిధ ఆరోగ్య పథకాలను వారు సమర్థంగా ఉయోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.


First Published:  5 Dec 2023 5:56 AM GMT
Next Story