Telugu Global
Andhra Pradesh

మోదీతో మీటింగ్.. జగన్ ఏం చెప్పారంటే..?

రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లయినా, అనేక అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పారు జగన్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని గుర్తు చేశారు.

మోదీతో మీటింగ్.. జగన్ ఏం చెప్పారంటే..?
X

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నా కూడా ఏపీ సీఎం జగన్ హడావిడిగా ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న జగన్, ఈరోజు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఎప్పటిలాగే విభజన చట్టంలోని అంశాలను మరోసారి ఆయన ప్రధాని ముందు ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల అమలుకి కమిటీలు వేసినా పురోగతి నామమాత్రమే అని చెప్పారు.

రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లయినా, అనేక అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పారు జగన్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసినా కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు జగన్.

2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండ్ రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందన్నారు జగన్. ఆ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు తీసుకుందన్న కారణంగా తమ ప్రభుత్వంపై ఆంక్షలు విధించారని, దానిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

పోలవరం బకాయిలు..

పోలవరం ప్రాజెక్టు విషయలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే నిర్మాణం పూర్తి చేస్తామని, ఫలితాలు ప్రజలకు అందుతాయని గుర్తు చేశారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.2600.74 కోట్లు వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ సూచించినట్టుగా రూ. 55,548 కోట్ల అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. పోలవరం ఆలస్యమయ్యే కొద్దీ ఖర్చు పెరిగిపోతుందని చెప్పారు జగన్.

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు కూడా ఇప్పించాలని కోరారు జగన్. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో ఏపీకి అన్యాయం జరిగిందని. 56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు.

హోదా కూడా..

ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు చేయాలని కోరారు జగన్. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలు చేశామని, మెడికల్‌ కాలేజీలు మొత్తం 14 మాత్రమే ఉన్నాయని, మిగిలిన 12 కాలేజీలకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకి కూడా నిధులు సమకూర్చాలని, ఏపీ ఎండీసీ గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  17 March 2023 9:04 AM GMT
Next Story