Telugu Global
Andhra Pradesh

హైదరాబాద్ కంటే విశాఖ మాల్ పెద్దది..

ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా కైలాసపురంలో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు భూమిపూజ చేశారు సీఎం జగన్. ఇది దక్షిణ భారత దేశంలోనే పెద్ద మాల్ అవుతుందన్నారు

హైదరాబాద్ కంటే విశాఖ మాల్ పెద్దది..
X

హైదరాబాద్ లో రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్ ను 7-8 ఎకరాల్లో నిర్మించిందని, అదే గ్రూప్ విశాఖలో 12-13 ఎకరాల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మిస్తోందని చెప్పారు సీఎం జగన్. 17 ఎకరాల విస్తీర్ణంలో 12-13 ఎకరాలలో నిర్మించే ఇనార్బిట్ మాల్ విశాఖకు ఆణిముత్యంలా ఉంటుందన్నారు. ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా కైలాసపురంలో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ కు భూమిపూజ చేశారు సీఎం జగన్.

విశాఖ అభివృద్ధికి మరింత దోహదం చేస్తూ, సాగరతీరంలో ఆణిముత్యంగా నిలిచిపోయే మంచి ప్రాజెక్టుకు శంకుస్థాపనతో శ్రీకారం చుట్టామన్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమాన్ని సాధ్యమయ్యేలా చేసిన రహేజా గ్రూప్ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇది దక్షిణ భారత దేశంలోనే పెద్ద మాల్ అవుతుందన్నారు. రూ.600 కోట్ల పెట్టుబడితో భారీ విస్తీర్ణంలో మాల్‌ నిర్మించడం వల్ల 8వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు జగన్.


ఇనార్బిట్ మాల్ నిర్మాణం పూర్తయ్యాక, మిగిలిన స్థలంలో ఫేజ్‌ –2 ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని, అందులో ఐటీ స్పేస్, ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మిస్తామన్నారు సీఎం జగన్. వీటన్నిటి ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే కార్యక్రమాలు అని వివరించారు.

ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన అనంతరం జీవీఎంసీ పరిధిలో రూ. 136 కోట్ల రూపాయలతో 50 అభివృద్ధి పనులను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ 129 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించారు. ఏయూ స్టార్టప్‌ అండ్‌ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ హబ్‌, ఏయూ ఫార్మా ఇంక్యుబేషన్‌ అండ్‌ బయోలాజికల్‌ మానిటరింగ్‌ హబ్‌, ఏయూ డిజిటల్‌ జోన్‌ అండ్‌ స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌ కాంప్లెక్స్‌, ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, ఏయూ అవంతి ఆక్వాకల్చర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ స్కిల్‌ హబ్‌ ని కూడా సీఎం జగన్ ప్రారంభించారు.

First Published:  1 Aug 2023 3:05 PM GMT
Next Story