Telugu Global
Andhra Pradesh

ఎక్కడి నుంచి పాలించాలో వేరెవరో ఎలా చెబుతారు..?

ఆర్థిక అనుకూలతతో పాటు పరిపాలన సౌలభ్యం కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా ఎన్నుకున్నామని చెప్పారు. కేవలం 5 నుంచి 10వేల కోట్ల రూపాయల ఖర్చులో విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా మార్చే అవకాశం ఉంటుందన్నారు.

ఎక్కడి నుంచి పాలించాలో వేరెవరో ఎలా చెబుతారు..?
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక అంశాలను ప్రస్తావించారు. మూడు రాజధానులపై స్పందించిన ఆయన.. ముఖ్యమంత్రిగా తాను ఎక్కడి నుంచి ప‌రిపాలించాలో ఎవరెవరో ఎలా నిర్దేశిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందన్నారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే మంత్రివర్గం ఉంటుందని.. అక్కడే సెక్రటేరియట్ ఉంటుందని సీఎం జ‌గ‌న్‌ స్పష్టం చేశారు.

ఆర్థిక అనుకూలతతో పాటు పరిపాలన సౌలభ్యం కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా ఎన్నుకున్నామని చెప్పారు. కేవలం 5 నుంచి 10వేల కోట్ల రూపాయల ఖర్చులో విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా మార్చే అవకాశం ఉంటుందన్నారు. లక్ష 8వేల కోట్లు ఖర్చు చేసినా అమరావతి మరో 20ఏళ్లకు గానీ అభివృద్ధి చెందే అవకాశం లేదని చెప్పారు.

లక్షల కోట్లు ఖర్చు చేస్తూ వెళ్లినా ఎప్పటికప్పుడు వ్యయం పెరుగుతుందని.. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కానీ ఒక స్వప్నమే అవుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతిపై కోపముంటే ఎందుకు అమరావతిని శాసన రాజధాని చేస్తామని ప్రశ్నించారు. చంద్రబాబు వేసిన లెక్కల ప్రకారమే అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు ఎకరానికి రెండు కోట్ల రూపాయ‌లు ఖర్చు అవుతుందన్నారు. చంద్రబాబు ఆయన మనుషులు అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ చేసింది వాస్తవమన్నారు. చంద్రబాబు ఆయన మనుషులు ఆందోళనంతా రాజధాని కోసం కాదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని ముఖ్యమంత్రి జ‌గ‌న్ విమర్శించారు.

First Published:  31 Oct 2022 4:33 AM GMT
Next Story