Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేలతో కీలక భేటీ.. జగన్ ఏం చెప్పారంటే..?

60 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వట్లేదు అని కూడా వారు ప్రచారం చేస్తారని, అలాంటి వాటిని నమ్మొద్దన్నారు. గేర్ మార్చి స్పీడ్ పెంచాలని ఎమ్మెల్యేలకు సూచించారు జగన్.

ఎమ్మెల్యేలతో కీలక భేటీ.. జగన్ ఏం చెప్పారంటే..?
X

"ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటినీ టచ్ చేయాలి. ప్రతి ఇంటికీ మొబైల్ స్టిక్కర్ ఇవ్వాలి, మన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో చూపించాలి. అవసరమైతే ప్రజలకు అర్థమయ్యేలా కరపత్రాలు ముద్రించి చూపించాలి. గేర్ మార్చాలి, స్పీడ్ పెంచాలి, సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఉధృతం చేయాలి." ఇదీ క్లుప్తంగా సీఎం జగన్ మీటింగ్ సారాంశం.

ఈనెల 7నుంచి జగనన్నే మన భవిష్యత్తు..

ఈ నెల 7వ తేదీ నుంచి జగనన్నే మన భవిష్యత్తు అనే పేరుతో వైసీపీ కొత్త ప్రచారం మొదలు పెట్టబోతోంది. మా నమ్మకం నువ్వే జగన్ అనే క్యాప్క్షన్ ని కూడా జనంలోకి తీసుకెళ్లాలని చూస్తోంది. జగనన్నే మన భవిష్యత్తు అనే ప్రధాన ప్రచార కార్యక్రమం కాగా, దానిలో అనేక ఉప కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాటిపై త్వరలోనే ఎమ్మెల్యేలకు స్పష్టత ఇస్తారు.

ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, ప్రతి ఇంటికి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి, చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వారు అంగీకరిస్తే వెంటనే ఆ ఇంటికి స్టిక్కర్ అతికిస్తారు, వారి ఇంట్లో ఫోన్లకు అతికించాల్సిందిగా స్టిక్కర్లు ఇస్తారు. ఇప్పటి వరకూ ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహసారథులు అని చెప్పారు, ఇప్పుడు ముగ్గుర్ని నియమించబోతున్నారు.

సెప్టెంబర్ నుంచి కొత్త కార్యక్రమాలు..

దాదాపుగా ఇప్పటికే సగం సచివాలయాల్లో గడపగడప కార్యక్రమాన్ని పూర్తి చేశామన్న జగన్, మిగతా సగం వచ్చే 5 నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఆగస్ట్ నాటికి గడప గడప కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారం చుడదామన్నారు. సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోవాలని, సోషల్ మీడియా ప్రచారాన్ని పెంచాలని కూడా జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు.

తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలి..

ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం మొదలు పెట్టిందని, రాబోయే రోజుల్లో ప్రతి ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తప్పుడు వార్తలు రాస్తుంటారని, వాటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలన్నారు సీఎం జగన్. 60 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వట్లేదు అని కూడా వారు ప్రచారం చేస్తారని, అలాంటి వాటిని నమ్మొద్దన్నారు. గేర్ మార్చి స్పీడ్ పెంచాలని ఎమ్మెల్యేలకు సూచించారు జగన్.

First Published:  3 April 2023 8:38 AM GMT
Next Story