Telugu Global
Andhra Pradesh

జగన్ సభలో మైనార్టీ మహిళలను అవమానించారా..? అసలు నిజమేంటి..?

"నగరిలో ముస్లిం మహిళలు బుర్ఖా ధరించారు కాబట్టి సభ ప్రాంగణంలో ప్రవేశాన్ని అడ్డుకున్నారు కదా రేపు అవే బుర్ఖాలు ధరించే ముస్లిం మహిళల ఓట్లు తీసుకోవద్దు, అభ్యర్థించవద్దు.." అంటూ ఓ కామెంట్ కూడా పెట్టి వీడియోలు విడుదల చేసింది టీడీపీ.

జగన్ సభలో మైనార్టీ మహిళలను అవమానించారా..? అసలు నిజమేంటి..?
X

విద్యా దీవెన నిధుల విడుదల కోసం నగరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అయితే ఆ సభకు ముస్లిం మహిళలను, ముఖ్యంగా బుర్ఖా ధరించిన మహిళలను రానివ్వలేదనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఆరోపణే కాదు, దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో, టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. బుర్ఖా ధరించిన ఓ మహిళను పోలీసులు అడ్డుకోవడం, ఆమె ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా సభ ప్రాంగణంలోనికి వెళ్లలేకపోవడం ఆ వీడియోలో ఉంది. రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫరూక్ షిబ్లీతో కూడా టీడీపీ మాట్లాడించింది.

"నగరిలో ముస్లిం మహిళలు బుర్ఖా ధరించారు కాబట్టి సభ ప్రాంగణంలో ప్రవేశాన్ని అడ్డుకున్నారు కదా రేపు అవే బుర్ఖాలు ధరించే ముస్లిం మహిళల ఓట్లు తీసుకోవద్దు, అభ్యర్థించవద్దు.." అంటూ ఓ కామెంట్ కూడా పెట్టి వీడియోలు విడుదల చేసింది టీడీపీ.


బుర్ఖా వేసుకుంటే అడ్డుకున్నారా..?

నగరి సభా ప్రాంగణంలోకి వెళ్లకుండా బుర్ఖా వేసుకున్న మైనార్టీ మహిళలను అడ్డుకున్న మాట వాస్తవం. అయితే వారితోపాటు మిగతా వర్గాల మహిళలు కూడా ఉన్నారు. కేవలం నలుపు దుస్తులు వేసుకొచ్చారనే కారణంతోనే వారిని పోలీసులు వారించారు. లోపలికి పంపించలేదు. అంతే కానీ అక్కడ మైనార్టీలను ప్రత్యేకంగా అడ్డుకోలేదు, బుర్ఖాలు ఉన్నాయన్న కారణంతోనే ఎవరికీ అడ్డు చెప్పలేదు.

నలుపంటే ఎందుకంత భయం..?

బుర్ఖాల విషయంలో టీడీపీ అబద్ధం చెప్పింది అనుకుందాం, మతం రంగు పులిమి జగన్ ని తప్పుబట్టాలని చూసింది అనుకుందాం. కానీ, నలుపు దుస్తుల్ని చూసి పోలీసులు, సాటి ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా ఆపేయడం ఎంతవరకు సబబు. నలుపు రంగు అంటే కేవలం, జగన్ కి నిరసన తెలిపేందుకే వేసుకుంటారా..? అయినా ప్రజల నిరసన తెలుసుకోలేని ప్రభుత్వం ఇక పాలన ఏం చేస్తున్నట్టు..? విమర్శలను తట్టుకోలేకపోతే వైనాట్ 175 ఎలా సాధ్యం. నలుపు దుస్తులకు నా సభలో నో ఎంట్రీ అని నేరుగా జగన్ చెబుతారని అనుకోలేం. ఇక్కడ పోలీసుల అత్యుత్సాహమే ఎక్కువగా కనపడుతోంది. ఒకవేళ నల్లరంగు దుస్తులు వేసుకున్నవారంతా ఒకేచోట చేరి నిరసన తెలిపితే.. ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటూ ఆ తప్పు తమమీద ఎక్కడపడుతుందో అనే భయం వారిది. ఉద్యోగుల నిరసనలను అంచనా వేయలేదంటూ ఏకంగా డీజీపీలనే మార్చేసిన ఉదాహరణలున్నాయి. సాధారణ పోలీసులు ఇంకెంత భయపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అందుకే నలుపు చుడీదార్లు వేసుకున్న మహిళలు, బుర్ఖాలు ధరించిన మహిళలు.. అందర్నీ అడ్డుకున్నారు.

*

First Published:  29 Aug 2023 1:10 AM GMT
Next Story